Vijayakanth Chiranjeevi: విజయకాంత్ రీమేక్స్‌తో బ్లాక్‌బస్టర్స్ కొట్టిన చిరంజీవి, వెంకటేష్ - ఏయే సినిమాలో తెలుసా?
చిరంజీవి నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు తమిళంలో విజయకాంత్ నటించిన సినిమా ఆధారం అని తెలుసా? తెలుగులో విజయకాంత్ సినిమాలు ఎన్ని రీమేక్ అయ్యాయి? ఏంటి?
Vijayakanth films remade in Telugu: దివంగత తమిళ కథానాయకుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ 150కు పైగా సినిమాల్లో నటించారు. తమిళంలో తప్ప మరో భాషలో ఆయన సినిమాలు చేయలేదు. అయితే... ఆయన సినిమాలు కొన్నిటిని తెలుగులో డబ్బింగ్ చేశారు. మరికొన్ని రీమేక్ చేశారు. అందులో చిరంజీవి హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దామా?
'ఠాగూర్'గా తెలుగులోకి వచ్చిన విజయకాంత్ 'రమణ'
'తెలుగు భాషలో నాకు నచ్చని ఓకే ఒక్క పదం... లంచం' - 'ఠాగూర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్! సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్. అయితే... ఈ సినిమా కథ ఎక్కడిదో తెలుసా? విజయకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'రమణ' స్ఫూర్తితో తెలుగు నేటివిటీకి తగ్గట్లు, మెగాస్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశారు. అదీ సంగతి!
'రమణ'కు ముందు చిరంజీవి చేసిన విజయకాంత్ రీమేక్స్!
'ఠాగూర్' చిత్రానికి ముందు కూడా విజయకాంత్ సినిమాలను చిరంజీవి రీమేక్ చేశారు. తమిళ హిట్ 'సత్తం ఓరు ఇరుత్తరై' సినిమా తెలుగులో 'చట్టానికి కళ్ళు లేవు'గా రీమేక్ అయ్యింది. ఆ రెండూ 1981లో విడుదల అయ్యాయి. ఆ రెండిటికీ కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. తమిళంలో విజయకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేశారు.
Also Read: వెంకటేష్‌తో చిరంజీవి మల్టీస్టారర్!
చిరంజీవి 'దేవాంతకుడు' సినిమా ఉంది కదా! అది విజయకాంత్ తమిళ సినిమా 'వెట్రి రీమేక్. ఆ రెండు సినిమాలకూ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. ఈ రెండిటికి కన్నడ సినిమా 'గెలవు నన్నదే' మూలం అని మరో టాక్. 'ఖైదీ నంబర్ 786' కూడా కెప్టెన్ 'అమ్మన్ కోయిల్ కళిక్కలే' రీమేక్.
విజయకాంత్ సినిమా రీమేక్స్‌లో మోహన్ బాబు!
ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు 'నేనే రాజు నేనే మంత్రి' అంటే రానా దగ్గుబాటి సినిమా గుర్తుకు వస్తుంది. అయితే... మోహన్ బాబు హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 1987లో ఆ పేరు (Nene Raju Nene Mantri)తో ఓ సినిమా వచ్చింది. దానికి మూలం తమిళంలో విజయకాంత్ నటించిన 'నన్నే రాజా నన్నే మంత్రి'. మోహన్ బాబు 'నా మొగుడు నాకే సొంతం' కూడా కెప్టెన్ 'ఎన్ పురుషన్ థాన్ ఎనక్కు మట్టుమ్ థాన్' రీమేక్.
వెంకటేష్ చేసిన రీమేక్స్ ఏంటి?
రీమేక్స్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుకు వచ్చే హీరోలలో వెంకటేష్ ఒకరు. ఆయన కూడా విజయకాంత్ సినిమాలను రీమేక్ చేశారు. వెంకీ 'చిన రాయుడు' సినిమాకు తమిళ హిట్, విజయకాంత్ సినిమా 'చిన్న గుండర్' ఆధారం.
Also Read: విప్లవ కళాకారుడి నుంచి 'కెప్టెన్ విజయకాంత్' కావడం వెనుక రోజా భర్త!
కెప్టెన్ విజయకాంత్ నటించిన 'వెనతై పోలా'ను రాజశేఖర్ 'మా అన్నయ్య' పేరుతో రీమేక్ చేశారు. శోభన్ బాబు 'దొంగ పెళ్లి' కూడా రీమేక్ సినిమా. విజయకాంత్ 'నినైవే ఓరు సంగీతం' ఆధారంగా తీశారు. విజయకాంత్ 'వైదేగి కతిరుంతాల్' సినిమాను తెలుగులో 'మంచి మనసులు'గా భానుచందర్ రీమేక్ చేశారు.