Vignesh Shivan: నన్ను పక్కనపెట్టేశారు, దానికి అజిత్ కారణం కాదు : విఘ్నేష్ శివన్
‘ఏకే 62’ నుంచి అజిత్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు విఘ్నేష్. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ నచ్చకపోవడం వలనే తాను ఈ మూవీ నుంచి తప్పుకున్నానని అన్నారు.
Vignesh Shivan: కోలీవుడ్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్ తమిళ స్టార్ హీరో అజిత్ కాంబోలో ‘ఏకే62’ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి విఘ్నేష్ ను తప్పించారని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే చివరకు మగిజ్ తిరుమేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ముందు ఈ సినిమాకు విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు అని ప్రచారం సాగింది. కానీ దీనిపై విఘ్నేష్ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఏకే 62’ సినిమా గురించిన విషయాలను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విఘ్నేష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘ఏకే 62’ నుంచి అజిత్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు విఘ్నేష్. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ నచ్చకపోవడం వలనే తాను ఈ మూవీ నుంచి తప్పుకున్నానని అన్నారు. అయితే ఇందులో అజిత్ పాత్ర ఏమీ లేదని, తనను సినిమా నుంచి తప్పుకోవాలని అజిత్ చెప్పలేదని అన్నారు. తనకు ‘ఏకే 62’ నిరాశ కలిగించిందని చెప్పారు విఘ్నేష్. సినిమా మిస్ అవ్వడంలో అజిత్ నుంచి ఎలాంటి తప్పు లేదని, సినిమాకు సంబంధించిన స్క్రిఫ్ట్ నిర్మాణ సంస్థ సంతృప్తి చెందలేదని, అందుకే మూవీ నుంచి తాను తప్పుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతానికి ‘ఏకే 62’ కు కొత్త దర్శకుడిగా మగిజ్ తిరుమేని ఫిక్స్ అయిపోయారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల్లోనే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత కొద్ద రోజులుగా ‘ఏకే 62’, విఘ్నేష్ వ్యవహారం పై చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. విఘ్నేష్ ను మూవీ నుంచి కావాలనే తప్పించారని, దీంతో ఆయన భార్య నయనతార కు కోపం వచ్చిందని, అందుకే ఇక ఆమె అజిత్ తో కలిసి నటించబోనని చెప్పిందనే వార్తలు తమిళ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తలన్నిటికీ విఘ్నేష్ చెక్ పెడుతూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి అజిత్ తో పనిచేసే అవకాశం లభించడంతో విఘ్నేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కొత్త సంవత్సరం నాడు చెప్పారు. అజిత్ తో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఓ నోట్ ను కూడా షేర్ చేశారు. అయితే తర్వాత మూవీ నుంచి విఘ్నేష్ తప్పుకోవాల్సి రావడంతో చాలా డిస్పాయింట్ అయ్యారు. ప్రస్తుతానికి విఘ్నేష్ తో సినిమా వాయిదా పడిందే కానీ మొత్తానికి క్యాన్సిల్ అవ్వలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. త్వరలోనే అజిత్-విఘ్నేష్ కాంబో లో సినిమా రానుందని అంటున్నారు. ‘ఏకే 62’ తర్వాత ఈ మూవీ గురించి ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు అజిత్ అభిమానులు. ఏదేమైనా అజిత్ 62 మూవీ, విఘ్నేష్ వ్యవహారం కోలీవుడ్ లో చర్చనీయాంశమైందనే చెప్పాలి. ఇక ‘ఏకే 62’ సినిమాలో స్టార్ నటుడు అరవింద స్వామి కూడా నటిస్తున్నారు. నెగిటివ్ రోల్ లో ఆయన కనిపించనున్నారని టాక్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.