Veera Simha Reddy Director : బాలకృష్ణ సినిమా చూసి రోజంతా జైల్లో ఉన్న దర్శకుడు
నటసింహం నందమూరి బాలకృష్ణ 107వ చిత్రానికి 'వీర సింహా రెడ్డి' టైటిల్ ఖరారు చేశారు. థియేటర్లలో 'వీర సింహా రెడ్డి'గా బాలయ్య విజృంభణ మామూలుగా ఉండదని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానిగా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy) చిత్రాన్ని తెరకెక్కించానని దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెలిపారు. బాలయ్య బాబును దర్శకత్వం వహించే అవకాశం రావడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. కర్నూలులోని కొండా రెడ్డి బురుజుపై అభిమానుల సమక్షంలో 'వీర సింహా రెడ్డి' 3డి టైటిల్ పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం ప్రదర్శించారు.
థియేటర్లలో 'వీర సింహా రెడ్డి' విజృంభిస్తాడు - గోపీచంద్ మలినేని
అభిమానులు అందరూ పండగ చేసుకునేలా 'వీర సింహా రెడ్డి' సినిమా ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''బాలకృష్ణ గారి 'సమర సింహా రెడ్డి' చూసిన అభిమానిగా... ఆ సినిమా ఫస్ట్ డే చూసి రోజంతా జైల్లో ఉన్న అభిమానిగా తీసిన సినిమా 'వీర సింహా రెడ్డి'. 'సమర సింహా రెడ్డి' మనకు ఎటువంటి వైబ్రేషన్ ఇచ్చిందో... అలాంటి వైబ్రేషన్ 'వీర సింహా రెడ్డి' ఇస్తుంది. అభిమానులు ఊహ కంటే రెండింతలు ఎక్కువ ఉంటుంది. సంక్రాంతి మన 'వీర సింహా రెడ్డి విజృభించబోతున్నాడు. అభిమానిగా నేను కూడా ఈ సినిమాను థియేటర్లలో చూడాలని ఎదురు చూస్తున్నాను'' అని పేర్కొన్నారు.
ఇప్పుడు విడుదల చేసినా బ్లాక్ బస్టరే!
'వీర సింహా రెడ్డి' చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందని గోపీచంద్ మలినేని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో అంత స్టఫ్ ఉందని, అయితే షూటింగ్ మరో 20 రోజులు బ్యాలన్స్ ఉందని ఆయన తెలిపారు. అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలని అనుకుంటున్నారో... అలా సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. పాటలు, డ్యాన్సులు అదిరిపోతాయన్నారు. తమన్ సంగీతం మామూలుగా ఉండదని చెప్పారు.
Balakrishna's Veera Simha Reddy Dialogues : బాలకృష్ణ అంటే పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండాలి. అందులోనూ సీమ నేపథ్యంలో సినిమా అంటే అభిమానులు చాలా ఊహిస్తారు. అందుకు తగ్గట్టుగా రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారని గోపీచంద్ మలినేని తెలిపారు. 'వీర సింహా రెడ్డి' పుట్టింది పులిచర్ల ... చదివింది అనంతపురం... రూలింగ్ కర్నూల్' లాంటి డైలాగులు సినిమాలో ఉన్నాయన్నారు.
Also Read : అమెరికాలో 'జిన్నా'ను ఎంత మంది చూశారో తెలుసా? - షాకింగ్ కలెక్షన్స్
'వీర సింహా రెడ్డి' సినిమా అభిమానులను, ప్రేక్షకులను 'సమర సింహా రెడ్డి' రోజుల్లోకి తీసుకు వెళుతుందని నిర్మాతలలో ఒకరైన నిర్మాత వై రవిశంకర్ అన్నారు. మంచి పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, డైలాగులు అన్నీ ఉన్న చిత్రమిదని, తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రేక్షకులు, అభిమానులకు కావాల్సిన అంశాలు అన్నీ 'వీర సింహా రెడ్డి'లో ఉన్నాయని... ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోబోతుందని రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పారు.
శ్రుతీ హాసన్ కథానాయికగా... ఇతర పాత్రల్లో హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.