గాయని వాణి జయరాం మృతిపై అనుమానాలు - పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముంది?
వాణి జయరాం నుదుటి భాగంపై గాయాలు ఉండటంతో అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ టీం తాజాగా వాణీ జయరాం మృతికి గల కారణాలు తెలుసుకున్నారు.
ప్రముఖ గాయని వాణీ జయరాం(78) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. చెన్నైలో ఫిబ్రవరి నాలుగో తేదీన నుంగంబాక్కంలోని తన నివాసంలో తలకు గాయాలతో కింద పడి ఉండటం గమనించిన సన్నిహితులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. అయితే ఆమె నుదిటిపైన గాయాలు ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాణీ జయరాం కేసులో తాజాగా ఫోరెన్సిక్ టీం రిపోర్టును విడుదల చేసింది. ఆమె తన రూమ్ లో కిందపడటంతో తలకు బలమైన గాయాలు అయ్యాయని, అందుకే ఆమె మరణించినట్లు వెల్లడించారు.
ఇంకా పోలీసుల రిపోర్టులో ఏముందంటే.. ఆమె మరణించిన సమయంలో తన నివాసంలో ఆమె ఒంటరిగా ఉందని నివేదికలో తెలిపారు. అలాగే వాణి జయరాం ఇంటి సమీపంలో సీసీ కెమెరాలను పూర్తిగా పరిశీలించినట్లు తెలిపారు. ఆ సీసీ టీవీ ఫుటేజిలో ఎలాంటి అనుమానస్పద కదలికలు కనిపించలేదని పోలీసులు ధృవీకరించారు. ఎవరూ కూడా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించినట్టు సంకేతాలు ఏమీ లేనట్లు తేల్చారు.
శనివారం వాణి జయరాం ఇంటి పనిమనిషి చాలా సేపు తలుపు తట్టినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో తలుపు బద్దలు కొట్టి చూడగా ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పనిమనిషి చెప్పింది. తాను ఎప్పటిలాగే పనికి వచ్చానని, అయితే కాలింగ్ బెల్ ని పదేపదే నొక్కినప్పటికీ తనకు ఎటువంటి స్పందన రాలేదని చెప్పింది. “నేను వాణి జైరామ్ నివాసంలో ఐదుసార్లు బెల్ కొట్టాను. కానీ ఆమె తలుపు తీయలేదు. నా భర్త కూడా ఆమెకు ఫోన్ చేశాడు, కానీ ఆమె కాల్ రిసీవ్ చేసుకోలేదు” అని ఆమె చెప్పింది. వాణీ జయరాం మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
Read Also: ఆరంభం అదిరింది - బ్లాక్ బస్టర్లతో మొదలైన 2023, బాలీవుడ్‌కూ మంచి రోజులు!
వాణీ జయరాం దశాబ్దాలుగా గాయనిగా సేవలందిస్తున్నారు. ఆమె ప్రతిభను గుర్తించి ఈ ఏడాది భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. దీంతో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఆమెను అభినందిస్తూ వరుసగా అందరూ ఫోన్ లు చేస్తున్నారు. ఇంతలోనే ఆమెకు ఇలా జరగడం అందరినీ కలచివేసింది. వాణీ జయరాం హిందీ చిత్రం గుడ్డి (1971), తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ (1975), ‘లోని యెజు స్వరంగలుక్కుల్’, ‘మల్లిగై ఎన్ మన్నన్ మయంగుమ్’ (1974), తమిళ చిత్రం ‘దీర్గ సుమంగళి’ నుంచి ‘బోలే రే పాపిహరా’ వంటి అనేక గుర్తుండిపోయే పాటలకు ఆమె తన మధురమైన గాత్రాన్ని అందించారు. తెలుగులో ‘శంకారభరణం’ వంటి సినిమాలకు తన గాత్రాన్ని అందించి విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ ఇలా పలు భాషలలో దాదాపు పది వేల పాటలకు పైగా పాటలు పాడి రికార్డ్ సృష్టించారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మరియు బెంగాలీ భాషలలో 10,000 పాటలను రికార్డ్ సృష్టించారు. RD బర్మన్, మదన్ మోహన్, OP నయ్యర్, M S విశ్వనాథన్, ఇళయరాజా వంటి ప్రముఖ స్వరకర్తలు, సంగీతకారులతో కలిసి పనిచేశారు వాణీ జయరాం.