Vaarasudu OTT: ‘వారసుడు’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్? - ఎప్పటి నుంచి స్ట్రీమ్ కానుంది?
‘వారసుడు’ సినిమా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.
Vaarasudu OTT Release Date: తమిళ హీరో తలపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘వారసుడు’. థియేటర్లలో ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాతలు ఇటీవలే వెల్లడించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘వారసుడు’ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. హిందీ వెర్షన్ ఏ ఓటీటీ అనే విషయం ఇంకా తెలియరాలేదు. తమిళంలో ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’, మలయాళంలో ‘వంశజం’ పేరుతో ఈ స్ట్రీమ్ కానుంది.
‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాల దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'వారిసు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక మండన్న కథానాయికగా నటించారు. ఇప్పటికే వచ్చిన అనేక తెలుగు సినిమాల షేడ్స్ ఇందులో కనిపించాయి. వెంకటేష్ ‘లక్ష్మి’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలు కూడా ‘వారసుడు’లో చూడవచ్చు.
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.
ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌తో రూపొందుతున్న ‘లియో’ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో శరవేగంగా జరుగుతోంది. కేవలం నాలుగు నెలల్లోనే సినిమా పూర్తి చేయాలనే టార్గెట్‌తో లోకేష్ కనగరాజ్ పని చేస్తున్నారు. మే నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని టాక్ వినిపిస్తుంది.
జూన్ 22వ తేదీన విజయ్ పుట్టిన రోజు నుంచి ప్రమోషన్లు ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి నాలుగైదు నెలలు నాన్ స్టాప్‌గా ప్రమోట్ చేసి అక్టోబర్ 19వ తేదీన దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్లు కాగా, కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ మీదనే ఈ అమౌంట్ రికవరీ అయిపోయినట్లు తెలుస్తోంది.
థియేటర్ మీద అన్ని భాషల్లో కలిపి రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని అంచనా. అంటే నాన్ థియేట్రికల్ మీద పెట్టుబడి రికవరీ అయిపోయినా, థియేటర్ మీద వచ్చేదంతా మిగిలినట్లే అన్నమాట. ఈ లెక్కన నిర్మాతలపై ‘లియో’ కాసుల వర్షం కాదు, సునామీ కురిపించడం ఖాయం.
'లియో'లో విజయ్ జోడీగా త్రిష నటిస్తున్నారు. తమిళంలో విజయ్, త్రిషది సూపర్ డూపర్ హిట్ జోడీ. సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఒక్కడు' తమిళ రీమేక్ సహా 'కురివి', 'తిరుప్పాచ్చి', 'అతి' సినిమాల్లో వాళ్ళిద్దరూ నటించారు. 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ విజయ్, త్రిష నటిస్తున్నారు.