Kasthuri On Jr NTR: ఎన్టీఆర్‌ను మంచు లక్ష్మితో పోల్చకండి - ‘ఆంటీ’ అనడం తప్పే: నటి కస్తూరి
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ఇంగ్లీష్ యాసను పలువురు నెటిజన్లు విమర్శించడాన్ని నటి కస్తూరి తప్పుబట్టారు. అమెరికన్ ఇంగ్లీష్ లో మాట్లాడితేనే అక్కడి వాళ్లకు అర్థం అవుతుందని చెప్పారు.
రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. తాజాగా ఈ సినిమాకు ఆస్కార్ తర్వాత అంతటి పేరున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. కాలిఫోర్నియాలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో నటుడు ఎన్టీఆర్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన అమెరికన్ ఇంగ్లీష్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఈ ట్రోలింగ్ పై తాజాగా సీనియర్ నటి కస్తూరి స్పందించారు. ఎన్టీఆర్ పై నెటిజన్ల విమర్శలను ఆమె తప్పుబట్టారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ చాలా చక్కగా మాట్లాడారని చెప్పారు.
ఎన్టీఆర్ చక్కగా మాట్లాడారు- కస్తూరి
‘‘అమెరికా వాళ్లకి వాళ్ల యాసలో మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ, మనలో చాలా మంది ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను. అక్కడ భాష ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి వాళ్లలాగా మాట్లాడితే అర్థమవుతుంది. నేను తమిళ యాక్సెంట్‌లో తెలుగులో మాట్లాడితే అర్థమవుతుందా? అర్థం కాదు కదా’’ అని కస్తూరి వెల్లడించారు.
ఎన్టీఆర్ ను మంచు లక్ష్మితో పోల్చకూడదు- కస్తూరి
ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఇంగ్లీష్ మాట్లాడే విధానంపైనా కస్తూరి స్పందించారు. హైదరాబాద్‌కి వచ్చి అలాంటి స్లాంగ్‌లో మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారని చెప్పారు. తెలుగమ్మాయి ఇక్కడ తెలుగే మాట్లాడొచ్చు కదా. తెలుగు కూడా అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడటం ఎందుకంటూ చురకలంటించింది. ఈ విషయంలో ఎన్టీఆర్‌ని, మంచు లక్ష్మితో అస్సలు పోల్చకూడదన్నారు.
అనసూయ ‘ఆంటీ’ వ్యవహారంపై స్పందించిన కస్తూరి
యాంకర్ అనసూయ ‘ఆంటీ’ వ్యవహారం పైనా కస్తూరి స్పందించారు. ‘‘చిన్న పిల్లలు ఆంటీ అని పిలవడానికి, పెద్ద వయసు వాళ్లు ఆంటీ అని పిలవడానికి చాలా తేడా ఉంది. చిన్నపిల్లలు గౌరవంతో పిలుస్తారు. అదే పెద్ద వయసు వాళ్లు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఆంటీ అని పిలవడం సరైన పద్ధతి కాదు. అనసూయను ఆంటీ అని కామెంట్ చేయడం తప్పు. ఇండస్ట్రీలో ఆమె కంటే పెద్ద వయసు ఉన్న నటులు ఉన్నారు. వాళ్లని కూడా ఇలాగే అంకుల్ అని పిలుస్తున్నారా? ఆంటీ అనే పదానికి ఈ మధ్యకాలంలో ఎన్నో చెత్త అర్థాలు వచ్చాయి. అనసూయను ఆంటీ అంటున్నారంటే.. దురుద్దేశంతో అయినా అయి ఉండాలి.. లేదా ఆమెను అగౌరవపరచాలనే ఉద్దేశమైనా అయి ఉండాలి. ఈ విషయంలో నేను ఆమెకే సపోర్ట్ చేస్తున్నా’’ అని కస్తూరి వివరించారు. ప్రస్తుతం కస్తూరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: ‘SSMB 28’ న్యూ షెడ్యూల్ - నేటి నుంచి భారీ సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ