Tollywood Drug Case: నవదీప్‌ను విచారిస్తున్న ఈడీ.. ఎఫ్-క్లబ్ కేంద్రంగా డ్రగ్స్ లావాదేవీలు?
టాలీవుడ్ డ్రగ్ కేసు నేపథ్యంలో ఈడీ సోమవారం నటుడు నవదీప్‌ను విచారిస్తోంది. నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్ నుంచి జరిగిన లావాదేవీలను విచారించనుంది.
డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు నటుడు నవదీప్ హాజరయ్యాడు. ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్‌ను కూడా ఈడీ విచారిస్తోంది. మొదట్లో ఈ కేసు డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్ చుట్టూ తిరిగినా, విచారణ క్రమంలో ఎఫ్-క్లబ్‌లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. దీంతో సోమవారం నాటి విచారణకు హీరో నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్ హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు తెలుగు సినీ ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేసిన డ్రగ్స్ కేసుకు తోడు తాజాగా మనీ లాండరింగ్ కోణంలో విచారణ సాగుతుండండం ఉత్కంఠ రేపుతోంది.
2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్దూస్, జీషాన్‌లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. వీరి బ్యాంక్ అకౌంట్స్ నుంచి విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్లు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి. అంతేకాదు.. సినీ తారల బ్యాన్ అకౌంట్స్ నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీషాన్ ల అకౌంట్స్ మధ్య లావాదేవీలు జరిగినట్లు కూడా తేలింది. కెల్విన్ కాల్ డేటా.. అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ ను బట్టి సెలబ్రిటీలకు నోటీసులు పంపించింది ఈడీ. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన సెలబ్రిటీల నుంచి పూర్తి వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తోంది ఈడీ.
ఎఫ్ క్లబ్‌లో ‘డర్టీ పిక్చర్’?: ఈ డ్రగ్స్ కేసు నవదీప్ చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా 2016లో హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో నటుడు నవదీప్ పార్టనర్‌గా ప్రారంభించిన ‘ఎఫ్-క్లబ్’ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. ఆ రోజు నవదీప్ ఆహ్వానం మేరకు ఆ క్లబ్‌లో పార్టీకి హాజరైన తారలే ఎక్సైజ్ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా ఈడీ విచారణకు సైతం హాజరువుతున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ అక్రమ సరఫరా నిందితుడు కాల్విన్ మస్కరేన్హాస్ సినీ ప్రముఖులను కలిశాడని తెలిసింది. అయితే, కెల్విన్ సిట్ విచారణలో ఎలాంటి వివరాలు చెప్పలేదు. కానీ ఈడీకి అప్రూవర్‌గా మారి మొత్తం వివరాలు అందించాడు. ఏయే సెలబ్రిటీల ద్వారా అతడి అకౌంట్లోకి నగదు బదిలీ జరిగేది, ఎవరి నుంచి తనకు ఆర్డర్లు వచ్చేవి తదితర వివరాలను కెల్విన్ ఈడీకి తెలిపాడు. అతడు చెప్పిన ఆధారలతోనే ఈడీ ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలను విచారిస్తోంది. ఈ విచారణలో నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ అందించే వివరాలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఈడీ వద్ద కొన్ని ముఖ్యమైన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఈ నెల 15న ముమైత్‌ఖాన్, 17న తనీష్, 22న తరుణ్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?