Karate Kalyani: అలా చేయడం ఇష్టం లేకే సినిమాలు చేయడం లేదు, త్వరలో నేనే ఓ మూవీ తీస్తా: కరాటే కల్యాణి
హిందూ ధర్మం కోసం పని చేస్తున్న తాను బోల్డ్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేకే సినిమాలు చేయడం లేదని చెప్పారు నటి కరాటే కల్యాణి. త్వరలో తన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాట్లు తెలిపారు.
కరాటే కల్యాణి. తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. గత కొంతకాలంగా హిందూ మతం కోసం పోరాటాలు చేస్తున్నారు. తాజాగా కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుని రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఈ వివాదం కారణంగా ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు.
కావాలనే సినిమాలు చేయడం తగ్గించాను
తనకు సినిమా అవకాశాలు రావడం లేదనేది వాస్తవం కాదని కరాటే కల్యాణి తెలిపారు. “వ్యాంప్ క్యారెక్టర్లు చేయకూడదని నిర్ణయించుకున్నాను. చాలా సినిమాల్లో బోల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న క్యారెక్టర్లే ఎక్కువ చేశాను. ప్రస్తుతం నేను హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ వర్గానికి చెందిన వాల్లు నువ్వు సినిమాల్లో చేసిన క్యారెక్టర్లు ఏంటి? అని ప్రశ్నించారు. కొన్ని వీడియోలను చేసి, నన్ను ట్రోల్ చేశారు. అనకూడని మాటలు అన్నారు. వాటిని నేను తట్టుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. కొన్నిసార్లు ఇంట్లో కూర్చొని ఏడ్చిన సందర్భాలున్నాయి. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై వ్యాంప్ క్యారెక్టర్లు చేయడం మానుకోవాలి అనుకున్నాను. అనుకున్నట్లుగానే చేయడం లేదు. ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు. కానీ, చేయడం లేదు. నేనే తగ్గించుకున్నాను. అవకాశాలు తగ్గలేదు. కొన్ని సినిమాల్లో చేస్తున్నాను. లెక్చరర్ గా, సామాజిక కార్యకర్తలా చేస్తున్నాను. అవి నాకు నచ్చాయి. మంచి విలన్ క్యారెక్టర్ చేయాలనుంది. మంచి కమెడియన్ గా చేయాలనుకుంది. మంచి అత్త క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్, అమ్మమ్మ క్యారెక్టర్ చేయాలనుకుంది. ఎవరైనా దర్శకులు అవకాశం ఇస్తే చేస్తాను. రాకపోతే మానేస్తాను” అని చెప్పుకొచ్చారు.
నా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది!
త్వరలోనే తాను మెగా ఫోన్ పట్టబోతున్నట్లు వెల్లడించారు కల్యాణి. సమాజానికి పనికి వచ్చే సినిమాను తీయబోతున్నట్లు తెలిపారు. “నేను త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నాను. నేను చేయబోయే సినిమా సమాజానికి పనికి వస్తుంది. సమాజంలో జరుగుతున్న విషయాలను బేస్ చేసుకుని ఉంటుంది. ఇందులో రాజకీయాలు కూడా ఉండచవచ్చు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్ రెడీ అయ్యింది. అమ్మాయిలు, అబ్బాయిలు, ప్రస్తుత తరం వాళ్లు ఎలా చెడిపోతున్నారు? అనే విషయాలను ఇందులో ఎక్కువగా ప్రస్తావించబోతున్నాం. ఒక సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. వాస్తవానికి నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే దర్శకత్వం వైపు వెళ్లాలి అనుకున్నాను. కానీ, అప్పట్లో ఓ దర్శకుడి సలహా మేరకు నటిగా చేశాను. విజయ నిర్మల నాకు ఆదర్శం. ఆమె దర్శకత్వంలోనే నేను తొలుత చిన్న వేషం వేశాను. ఆమె మాదిరిగానే నేను కూడా దర్శకత్వం చేయాలి అనుకుంటున్నాను. కనీసం నా దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా తీయాలి అనే కోరిక ఉంది. ఈ సినిమా థియేటర్లలోనే విడుదల కావాలనే రూల్ ఏమీ లేదు. ఓటీటీకి ఇస్తాను. లేదంటే యూట్యూబ్ లో పెట్టుకుంటాను. ఎలా అయినాఫర్వాలేదు. సినిమా మాత్రం చేస్తాను” అని వెల్లడించారు.