Mukesh Khanna: భారీ బడ్జెట్‌తో ‘శక్తిమాన్’ నిర్మాణం - ‘స్పైడర్ మ్యాన్’ నిర్మాణ సంస్థ చేతికి ఇండియన్ మూవీ: ముఖేష్ ఖాన్నా
ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ‘శక్తిమాన్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.
90వ దశకంలో బుల్లి తెర ప్రేక్షకులను, ఇంకా చెప్పాలంటే పిల్లలకు అద్భుతంగా నచ్చిన సీరియల్ ‘శక్తిమాన్’. ఎవరు ఆపదలో ఉన్నా ఈ సూపర్ హీరో ఇట్టే వచ్చి కాపాడేవారు. పిల్లలు అయితే, బయట కూడా శక్తిమాన్ వచ్చి కాపాడుతాడు అని భావించేవారు. అంతటి ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ కొంత కాలం తర్వాత ఆగిపోయింది. ప్రస్తుతం ఇదే కథతో ‘శక్తిమాన్’ అనే సినిమాను తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.
రూ. 300 కోట్లతో ‘శక్తిమాన్’ నిర్మాణం
తాజాగా ‘శక్తిమాన్’ గురించి ముఖేష్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా బడ్జెట్, నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆనేక విషయాలను వెల్లడించారు. పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోందని చెప్పుకొచ్చారు. “కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. ఈ సినిమాను ‘స్పైడర్‌మ్యాన్’ను నిర్మించిన సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో రెడీ కానుంది. ‘క్రిష్’, ‘రా వన్’ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో నేనూ నటిస్తున్నాను. అయితే, ఇప్పుడే నా పాత్ర గురించి ఏమీ చెప్పలేను. ప్రస్తుతానికి నేను ‘శక్తిమాన్’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తారు? దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయాల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
‘శక్తిమాన్’ను తెరకెక్కిస్తున్న స్పైడర్ మ్యాన్ మేకర్స్
అంతేకాదు, “’శక్తిమాన్’ సినిమా పూర్తి కమర్షియల్ మూవీగా రూపొందనుంది. ఈ సినిమాని స్పైడర్ మ్యాన్ మేకర్స్ చేస్తున్నారు. కానీ, శక్తిమాన్ దేశీ సూపర్ హీరోగానే ఉంటాడు. ఈ సినిమా కథను ఇప్పటికే సిద్ధం చేశాను. మేకర్స్ కు నా ఒక్కటే షరతు. ఈ సినిమా కథ మార్చడానికి వీల్లేదు. శక్తిమాన్ ఎవరు అవుతారని ప్రజలు అడుగుతారు? ఇది కూడా చాలా పెద్ద ప్రశ్న. నేను సమాధానం చెప్పను. కానీ, ముఖేష్ ఖన్నా లేకుండా ‘శక్తిమాన్’ ఉండడు అని కచ్చితంగా చెప్పవచ్చు” అన్నారు. హాలీవుడ్ దర్శకుడు ఎవరైనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా? అని అడిగినప్పుడు “ఈ సినిమా కథ భారతదేశానికి సంబంధించినది. దర్శకుడు కూడా ఇక్కడ వ్యక్తి అయి ఉండాలి. బయట నుంచి వచ్చిన దర్శకుడు భారతీయ సందర్భాన్ని అర్థం చేసుకోలేడు” అని ముఖేష్ ఖన్నా వివరించారు. గత సంవత్సరం, సోనీ పిక్చర్స్ ఇండియా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది. మూవీ నిర్మాణం గురించి ప్రకటన చేసింది.
8 ఏళ్ల పాటు ప్రసారం అయిన ‘శక్తిమాన్’
దూరదర్శన్ చానెల్ లో 1997 నుంచి 2005 వరకూ ‘శక్తిమాన్’ సీరియల్ టెలీకాస్ట్ అయ్యింది. ఇందులో శక్తిమాన్ గా ముఖేశ్ ఖన్నా నటించారు. ఇక, త్వరలో సినిమాగా రానున్న ‘శక్తిమాన్’ మూడు భాగాలుగా తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ విషయం అధికారికంగా వెల్లడి కాలేదు. ఇక ‘శక్తిమాన్’ పాత్రతో ముఖేష్ ఖన్నా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. BR చోప్రా ‘మహాభారత్’లో భీష్మ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. టెలివిజన్ షో ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’తోనూ అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also: ‘RRR’ మరో ఘనత, గోల్డెన్ ట్రైలర్ అవార్డుకు రీ-రిలీజ్ ట్రైలర్ నామినేట్!