The Sabarmati Report OTT: ఓటీటీలోకి ‘ది సబర్మతి రిపోర్ట్’, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
The Sabarmati Report : గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను బేస్ చేసుకుని రూపొందించిన చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది.
The Sabarmati Report OTT: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నది. ఈ సినిమా తొలి రోజునే రూ.1.15 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తున్నది. థియేటర్లలో సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా త్వరలో ప్రముఖ OTT ప్లాట్ ఫారమ్ లో అందుబాటులోకి రాబోతోంది. ఇంతకీ ఈ చిత్రం ఎప్పుడు? ఎక్కడ? స్ట్రీమింగ్ అవుతుందంటే..
‘ది సబర్మతి రిపోర్ట్’ ఏ ఓటీటీలో చూడాలంటే?
వాస్తవ ఘటనల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఓటీటీ డీల్ కంప్లీట్ అయ్యింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ Zee5లో విడుదల కాబోతోంది. థియేటర్లలో విడుదలైన 4 నుంచి 8 వారాల తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ చివరి వారంలో లేదంటే వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో జీ5లోఈ సినిమా రిలీజ్ అవుతుంది.
‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా గురించి..
ఫిబ్రవరి 27, 2002 ఉదయం గుజరాత్ లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన సబర్మతి ఎక్స్ ప్రెస్ దహన కాండ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కొంత మంది దుండగులు రైలుకు నిప్పు పెట్టడంతో 59 మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు. ఆ తర్వాత గోద్రా అల్లర్లు చెలరేగాయి. ఈ అన్ని సంఘటనలను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్ర పోషించగా, తుషార్ ఫుల్కే, ఏఐ అర్జున్, అంజలి నాడిగ్, సందీప్ కుమార్, సందీప్ వేద్ కీలక పాత్రల్లో కనిపించారు. ఏక్తా కపూర్, శోభా కపూర్, అమూల్ వి మోహన్, అన్షుల్ మోహన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.
‘ది సబర్మతి రిపోర్ట్’పై ప్రధాని మోడీ ప్రశంసలు
అటు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. నాటి ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు. ‘‘కల్పిత కథలు కొంత కాలమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఈ సినిమాను ఉద్దేశించి ఓ నెటిజన్ పెట్టిన పోస్టును షేర్ చేస్తూ ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్టు పెట్టారు.