Krishna About NTR: ఎన్టీఆర్ చేయట్లేదని నేనే చేసేశా, ఆ తర్వాత 12 ఫ్లాప్‌లతో అవకాశాలు రాలేదు: కృష్ణ
రాజమౌళి తర్వాత హీరోలకు వచ్చే ఫ్లాప్స్ తరహాలోనే హీరో కృష్ణ కూడా ‘అల్లూరి సీతారామారాజు’ సినిమా తర్వాత ఎదుర్కొన్నారట. వరుసగా ఆయన 12 ఫ్లాప్‌లతో సినీ అవకాశాలు కోల్పోయారట.
సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమార్తె మంజులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘అల్లూరి సీతారామారాజు’ సినిమా తన కెరీర్ మీద ఎంత ప్రభావం చూపిందో వివరించారు.
అల్లూరి సీతారామరాజు సినిమా ఎన్టీఆర్ చేస్తారని చూశా: ‘‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్.టి.రామారావుగారు అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తానని ప్రకటించారు. సినిమాలో హీరో అయ్యాక ఓసారి నాకు అల్లూరి సీతారామరాజు వేషం వేశారు. ఆ గెటప్‌లో నేను ఒదిగిపోయానని చెప్పారు. ఎన్నాళ్లైనా రామారావుగారు ‘అల్లూరి’ సినిమా తీయకపోతే నేనే చేసేశా. దర్శకుడు, నిర్మాత చక్రపాణి ఆ సినిమా చూసిన తర్వాత.. నీతో ఎంతమంది సినిమాలు చేస్తున్నారని అడిగారు. ఏడు ఎనిమిది మంది చేస్తున్నారు. ఇంకో ఆరేడు మంది వెయిటింగ్‌లో ఉన్నారని చెప్పా. ఇక వాళ్లు నీతో సినిమా చేయరని చెప్పేశారు. ఈ సినిమా చేశాక నువ్వు ఎంత యాక్ట్ చేసినా రెండుమూడేళ్లు నీకు హిట్ రాదని చెప్పారు. ఆయన చెప్పినట్లే.. 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
ఇక కృష్ణ అయిపోయాడనే సందర్భంలో ‘పాడిపంటలు’ ఆదుకుంది: ఆ 12 చిత్రాలు చాలామంచి సినిమాలు. ఆ ఫ్లాప్స్ తర్వాత నన్ను హీరోగా బుక్ చేయడం మానేశారు. దీంతో సొంత బ్యానర్‌పై పాడిపంటలు సినిమా తీశాం. ఎంతో కష్టపడి ఆ సినిమా తీశాం. ఇక కృష్ణ అయిపోయాడు అనుకొనే సందర్భంలో ‘పాడి పంటలు’ సినిమా అల్లూరి సీతారామారాజు సినిమా కంటే మంచి హిట్ కొట్టింది. మళ్లీ నాకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది’’ అని తెలిపారు.
చత్రపతి శివాజీ పాత్ర అందుకే చేయలేదు: ‘‘నాకు చత్రపతి శివాజీ పాత్రలో నటించాలని ఉండేది. అయితే, చత్రపతి మహ్మదీయులకు వ్యతిరేకులు. మహ్మదీయుల మనోభావాలను దెబ్బతీయడం ఎందుకని ఆ సినిమా చేయలేదు. కానీ, రెండు సినిమాల్లో ఆ వేషం ధరించి ప్రజలకు కనిపించాను’’ అని తెలిపారు.
Also Read: సినిమాల్లో నటించనని మహేష్ పరుగులు పెట్టాడు, ఆసక్తికర విషయాలు చెప్పిన కృష్ణ
ఆ బిరుదు రావడానికి కారణం వైఎస్సార్: ‘‘నాకు పద్మభూషన్ అవార్డు రావడానికి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కారణం. ఇంతకాలం నుంచి మీకు పద్మభూషన్ ఇవ్వకపోవడం ఏమిటని.. ఆయనే ప్రధానిని కలిసి ఆ జాబితాలో నా పేరును రాయించారు. నేను ఇంట్లో కూర్చుంటే.. అదే వచ్చింది’’ అని కృష్ణ తెలిపారు.
Also Read: ఫ్యామిలీతో లంచ్ అండ్ కేక్ కటింగ్ - సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్