Subhaleka Sudhakar: గౌతమి అలా తిట్టగానే షాకయ్యాను, ఆ సీన్ తర్వాత చాలాసార్లు సారి చెప్పా: ‘ద్రోహీ’ మూవీపై శుభలేఖ సుధాకర్
‘ద్రోహి’ సినిమాలో శుభలేఖ సుధాకర్ నెగెటివ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ మూవీలో గౌతమితో కలిసి సీన్లు చేస్తున్నప్పుడు వణికిపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆమెకు చాలాసార్లు సారీ చెప్పానన్నారు.
Subhaleka Sudhakar About Gouthami: కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శుభలేఖ సుధాకర్. పాత్రకు తగినట్టుగా ఒదిగిపోయిన నటించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఏ పాత్రకు ఎంత మేర నటించాలో అంతే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సుధాకర్. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో చక్కటి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నెగెటివ్ పాత్రలు పోషించిన సినిమాల గురించి కీలక విషయాలు వెల్లడించారు.
గౌతమికి చాలా సార్లు సారీ చెప్పా- శుభలేఖ సుధాకర్
కెరీర్ తొలినాళ్లలో చాలా సినిమాల్లో నెగెటివ్ రోల్స్ పోషించినట్లు సుధాకర్ చెప్పుకొచ్చారు. “‘పెళ్లి పుస్తకం‘, ‘లేడీస్ టైలర్‘, ‘అణ్వేషణ‘, ‘ద్రోహి‘ లాంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు చేశాను. ప్రతి మనిషిలోనూ ఒక వీక్ నెస్ ఉంటుంది. ‘ద్రోహి‘ సినిమాలోనూ నా క్యారెక్టర్ కు అలాంటి వీక్ నెస్ ఉంటుంది. ఆ సినిమాలో నటిస్తుంటే నాకు వణుకు పుట్టేది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నా ఫ్రెండ్స్ ను రావొద్దని కమల్ హాసన్ చెప్పారు. సెట్ లో కూడా అందరిని బయటకు పంపించేవారు. అవసరం అయిన వాళ్లు మాత్రమే ఉండేవారు. టెర్రరిస్టు పాత్రలో నటించాను. ఇంట్లోకి ప్రవేశించి అబ్బాయిపై కత్తి పెట్టి ఆమెను బలవంతం చేసే సన్నివేశం. నిజంగా ఆ సీన్ లో లీనమై చేశాను. చివరికి తను నాకు లొంగిపోయినట్లు నటించి చంపేస్తుంది. గౌతమి ఓపెన్ గా కిల్ దట్ బాస్టర్డ్ అని తిడుతుంది. అది విని షాక్ అయ్యాను. సీన్ కట్ చెప్పగానే ‘ఐయామ్ సారీ’ అని ఎన్నోసార్లు చెప్పాను” అని వెల్లడించారు.
కమల్, అర్జున్ నటన అద్భుతం
1995లో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, పీసీ.శ్రీరామ్ దర్శకత్వంలో ‘ద్రోహి’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అర్జున్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. సంఘవిద్రోహ శక్తులు, ఉగ్రవాదులను ఏరివేసే పోలీసు అధికారిగా కమల్ అద్భుతంగా నటించారు. ఇందులో ఉగ్రవాది క్యారెక్టర్ చేసిన శుభలేఖ సుధాకర్, అతడితో మరో మహిళ కమలహాసన్ ఇంటికి అతిథులుగా వస్తారు. కమల్ హాసన్ డ్యూటీ విషయంలో బయటకు వెళ్లిపోగానే విలువలు మరిచి శుభలేఖ సుధాకర్ గౌతమి మీద అత్యాచారం చేస్తాడు. అదే సమయంలో గౌతమి అతడిని చంపేస్తుంది. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా చెప్పుకోవచ్చు.
‘శుభలేఖ’ సుధాకర్ ఎలా అయ్యారంటే?
శుభలేఖ అనేది సుధాకర్ ఇంటిపేరు కాదు. 1982 కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శుభలేఖ’ సినిమా వచ్చింది. ఈ మూవీలో చిరంజీవి, సుమలత హీరో, హీరోయిన్లుగా నటించారు. సుధాకర్, తులసి ఇంకో జంటగా చేశారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. సుధాకర్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి సుధాకర్ కాస్త శుభలేఖ సుధాకర్ అయ్యారు.
Read Also: అది బురద కాదు.. ఓరియో బిస్కెట్లు - ‘మంజుమ్మెల్ బాయ్స్’లో సుభాష్ మేకప్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్