Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
శివ కార్తికేయన్- రవి కుమార్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’. ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.
శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని కోటపాడి రాజేష్, ఆర్ డి.రాజా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు.
వీఎఫ్ఎక్స్ వర్క్స్ మరింత ఆలస్యం
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో వీఎఫ్ఎక్స్ పనులకు చాలా సమయం పడుతోంది. సిజి వర్క్ లో కావలసిన అవుట్ పుట్ రాబట్టేందుకు చిత్ర బృందం శాయాశక్తులా ప్రయత్నిస్తోంది. సినిమా కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు కానీ, ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇవ్వాలని భావిస్తున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమాను దీపావళి బరి నుంచి సంక్రాంతి పోటీలోకి తీసుకెళ్లారు.
ఏలియన్ ప్రధాన పాత్రలో ‘అయలాన్’
ఈ చిత్రం గతంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెళ్లడించారు. “‘అయలాన్’ అంటే ఏలియన్ అని అర్థం. ఇప్పటికే కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి. ఏలియన్ ప్రధాన పాత్ర నేపథ్యంలో సౌత్ లో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. అందుకే ‘అయలాన్’ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. ఇందులో 4,500లకు పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ఇదే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ సమయం పడుతోంది’’ అని నిర్మాతలు తెలిపారు.
అక్టోబర్ లో ‘అయలాన్’ టీజర్ విడుదల
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చారు. “ మా ‘అయలాన్’ మూవీని అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చేలా సినిమా నాణ్యతను మెరుగు పరిచేందుకు మరికొంత సమయం పడుతుంది. ఈ సమయంలో చిత్రాన్ని అద్భుతంగా రూపొందించే ప్రయత్నం చేస్తాం. ప్రేక్షకుల నిరీక్షణకు తగిన ఫలితం దక్కుతుందని మేం నమ్ముతున్నాం. సంక్రాంతికి థియేటర్లలో గ్రహాంతర విందును చూడబోతున్నారు. మీ ప్రేమకు కృతజ్ఞతగా అక్టోబర్ మొదటి వారంలో ‘అయలాన్’ టీజర్ ను విడుదల చేస్తాం” అని ప్రకటించారు. ఈ సినిమాలో నటి ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, కరుణాకరన్, భానుప్రియ, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: సింగర్ శ్రీరామచంద్ర హీరోగా 'పాపం పసివాడు' - ట్రైలర్ ఎలా ఉందో చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial