Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
ఏబీపీ గ్రూప్ శత వార్షిక, ఏబీపీ దేశం మొదటి వార్షికోత్సవాల సందర్భంగా శ్రుతిహాసన్ ప్రత్యేక ఇంటర్వ్యూ.
తను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అమ్మ, నాన్నలు ఎవరికీ ఫోన్ చేసి రికమెండ్ చేయలేదని శ్రుతి హాసన్ అన్నారు. ఏబీపీ గ్రూప్ శత వార్షిక, ఏబీపీ దేశం మొదటి వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో శ్రుతి హాసన్ మాట్లాడారు. మన టాలీవుడ్ హీరోల గురించి కూడా కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్
‘ఆయన ప్రజలను బాగా ప్రేమిస్తారు. గబ్బర్ సింగ్ ముందు వరకు నన్ను తెలుగులో ఐరన్ లెగ్ అని పిలిచేవారు. ఆ టైంలో ఆయన వేరే హీరోయిన్‌ను పెట్టండి అనచ్చు. కానీ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నా బండి యూటర్న్ తీసుకుంది. ఆయన నాకు చాలా లక్కీ.’
చిరంజీవి
‘ఆయనతో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా కల నిజమైనట్లు అనిపిస్తుంది.’
ప్రభాస్
‘ఒక వ్యక్తి నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. తను నిజంగా డార్లింగ్.’
అల్లు అర్జున్
‘తను చాలా హార్డ్ వర్కింగ్. క్లాస్‌లో ఎప్పుడూ ఆన్సర్ చెప్పే టాపర్ లాంటి వ్యక్తి. పరీక్షలకు ముందే ఐదు సార్లు సిలబస్ మొత్తం రివైజ్ చేస్తారు కదా. అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి.’
రామ్ చరణ్
‘రామ్ చరణ్ చాలా వండర్ ఫుల్ పర్సన్. ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడు భారతదేశంలో అందరూ బన్నీ, చరణ్‌ని పొగుడుతుంటే ఇది మనకి ఎప్పుడో తెలుసు కదా అనిపిస్తుంది.’
నాగచైతన్య
‘తనతో పని చేసినందుకు ఎంతో సంతోష పడుతున్నాను. మేం ఎప్పుడో ప్రేమమ్ సినిమా చేశాం.’
బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి, నెపో కిడ్స్‌కు ఇండస్ట్రీలో ఎంట్రీ సులభంగా దొరుకుతుంది కదా అనే ప్రశ్నకు స్పందిస్తూ... ‘నెపో కిడ్, స్టార్ కిడ్ లాంటి పదాలు నాకు నచ్చవు. నా బ్యాక్‌గ్రౌండ్ నాకు ఇండస్ట్రీలో ఎంట్రీ మాత్రమే ఇవ్వగలదు. లోపలికి వెళ్లి నిరూపించుకోవాల్సింది మాత్రం నేనే. ఆ ప్రాసెస్‌లో ఎవరైనా హార్డ్‌వర్క్ చేయాల్సిందే. ఆ సమయంలో మా అమ్మ, నాన్న ఎవరికీ ఫోన్లు చేసి నాకు అవకాశాలు ఇవ్వమని అడగలేదు. నువ్వేమైనా చేయాలంటే సొంతంగా చేసుకో. నాకేమైనా సాయం కావాలన్నా, నేను బయట ఎక్కడైనా ఉండాలన్నా దానికి మాత్రమే వారు సాయం చేసేవారు. అది తప్ప నాకేమీ హెల్ప్ చేయలేదు. ఆ సమయం మనం పడే స్ట్రగుల్ మన కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుంది. ఆ చాలెంజ్ లేకపోతే మనం మెరుగు పడం.’
ఆ తర్వాత భారత దేశం గురించి మాట్లాడుతూ ‘భారతదేశం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకమైన, దేశాల్లో ఇండియా ఒకటి.’ అన్నారు. భారతీయ మహిళల గురించి చెబుతూ ‘మనదేశంలో సంప్రదాయాలు, ఆధునికత కలిసి ఉన్నాయి. ఈ ఫంక్షన్‌ను కూడా మనం దీపం వెలిగించే ప్రారంభించాం. భారతదేశంలో మహిళలకు విద్య, ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం. సాధారణంగా నేను ఎవ్వరికీ సలహాలు ఇవ్వను. కానీ మహిళలకు నేను చెప్పేదేంటంటే... దయచేసి విద్య, ఆర్థిక స్వాతంత్ర్యంపై దృష్టి పెట్టండి.’ అన్నారు.