Puneeth Rajkumar: హార్ట్ ఎటాక్ కాదు... నా దగ్గరకు వచ్చేసరికి పునీత్ పరిస్థితి ఇలా ఉంది... షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఫ్యామిలీ డాక్టర్
గుండె పోటుతోనే పునీత్ మరణించినట్టు ప్రచారం జరిగింది, కానీ ఫ్యామిలీ వైద్యులు మాత్రం అది హార్ట్ ఎటాక్ కాదని చెబుతున్నారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠన్మరణం కన్నడ సినీ అభిమానులను షాక్ కు గురిచేసింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఇలా అనూహ్యంగా మరణించడం తట్టుకోలేకపోయారు ఆయన అభిమానులు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తికి గుండె పోటు రావడమేంటని వాడీవేడి చర్చలు మొదలయ్యాయి. ఈ సమయంలో పునీత్ ఫ్యామిలీ వైద్యుడు రమణారావు కొన్ని షాకింగ్ విషయాలు మీడియాతో పంచుకున్నారు. పునీత్ చనిపోయింది హార్ట్ ఎటాక్ తో కాదని చెబుతున్నారు. మరణించడానికి కొన్ని నిమిషాల ముందు వరకు పునీత్ ఎలా ఉన్నారో, ఏం జరిగిందో వివరించారాయన.
ఆ రోజు జరిగిందిదే...
శుక్రవారం పునీత్ కు కాస్త నలతగా అనిపించింది. ఆయన తన భార్య అశ్వినితో కలిసి నా వద్దకు వచ్చారు. ఆయనకు పలు పరీక్షలు నిర్వహించాను. బీపీ, షుగర్ టెస్టు, ఈసీజీ ఇలా అన్ని టెస్టులూ చేశాను. బీపీ స్థిరంగా ఉంది, గుండె కొట్టుకోవడం కూడా సక్రమంగానే ఉంది. ఊపిరితిత్తుల్లోనూ ఏ సమస్యా కనిపించలేదు. నా దగ్గరకు వచ్చేసరికే పునీత్ కు చెమటలు పట్టేసాయి, అయితే జిమ్ చేశాక చెమటలు కారడం సహజమే. ఈసీజీ టెస్టు చేశాక మాత్రం అందులో ఓ స్ట్రెయిన్ కనిపించింది. ఎందుకైనా మంచిదని విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆయన భార్య అశ్వినికి సూచించాను. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి అందుకే ఆ ఆసుపత్రిని సూచించాను. వారు ఆసుపత్రికి చేరేలోపే ఐసీయూ సిద్ధం చేయమని విక్రమ్ ఆసుపత్రికి ఫోన్ చేసి చెప్పా. కేవలం అయిదారు నిమిషాల్లోనే పునీత్ ఆసుపత్రికి చేరుకున్నారు. అయినా సరే ప్రాణం కాపాడుకోలేకపోయాం.
అది కార్డియాక్ అరెస్ట్
ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో పునీత్ చాలా శ్రద్ధ వహించేవారు. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం నమ్మలేకపోతున్నాం. ఇదొక హఠాత్పరిణామం. పునీత్ గుండె పోటు వల్ల చనిపోయారని అందరూ అనుకుంటున్నారు కానీ ఆయన కార్డియాక్ అరెస్టు వల్ల మరణించారు. గుండె పోటులో గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది, కార్డియాక్ అరెస్టులో గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్టుకు దారితీసే అంశాలు చాలా ఉన్నాయి, పునీత్ విషయంలో ఆ అంశాలను అంచనా వేయడం కూడా కష్టమే. ఎందుకంటే ఆయనకు మధుమేహం, హైబీపీ కూడా లేవు. అందుకే పునీత్ విషయంలో ఏ జరిగిందో కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ ఆయనకు ఇలా జరగడం మాత్రం తీరని శోకమే.
Also Read: పునీత్ రాజ్‌కుమార్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్ నివాళి.. తలకొట్టుకుంటూ కన్నీరుమున్నీరు
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి