Shaakuntalam OTT Streaming: ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘శాకుంతలం’, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలం అయ్యింది.
ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యింది. కాళిదాసు నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ నుంచి ప్రేరణ పొంది గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్ర పోషించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన హిస్టారికల్ ఫాంటసీ డ్రామా ‘శాకుంతలం’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. తొలి షో నుంచే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ స్పందన లభించింది.
మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
‘శాకుంతలం’ సినిమా OTT స్టీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషలలో స్ట్రీమింగ్ హక్కులను OTT దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. మే 12 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో ఆకట్టుకోలేని ‘శాకుంతలం’ సినిమాకు OTTలో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రం పౌరాణిక నేపథ్యంతో భారీ బడ్జెట్ తో రూపొందించినా, కథనంలో లోపాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు.
‘శాకుంతలం’ సినిమా గురించి
‘శాకుంతలం’ సినిమాను దుశ్యంతుడు, శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించారు. కాళిదాసు రచించిన ప్రసిద్ధ నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మించారు. ఇందులో దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు నటించారు.
View this post on Instagram
వరుస సినిమాలతో సమంత బిజీ
ఈ సినిమా డిజాస్టర్ తర్వాత సమంత ‘సిటాడెల్’ ఇండియా వెర్షన్ లో నటిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజ్ & డీకే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు లండన్ లోనూ ఈ సిరీస్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి ‘కుషి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
Read Also: ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై సర్వత్రా నిరసనలు, థియేటర్ల దగ్గర భద్రత పెంచిన పోలీసులు