Sardar Sequel Announced : 'సర్దార్ 2' కన్ఫర్మ్ - ఇప్పుడు కార్తీ చేతిలో మూడు సీక్వెల్స్
దీపావళి హిట్ 'సర్దార్' సినిమాకు సీక్వెల్ ఉంటుందని మంగళవారం చెన్నైలో జరిగిన సక్సెస్ మీట్‌లో చిత్రబృందం వెల్లడించింది.
దీపావళికి విడుదల అయిన సినిమాల్లో 'సర్దార్' (Sardar Movie) మంచి పేరు తెచ్చుకుంది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కార్తీ సినిమా విమర్శలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి పేరుతో పాటు వసూళ్లు కూడా వస్తున్నాయి. ఈ విజయం అందించిన ఉత్సాహంతో సీక్వెల్ చేయడానికి కార్తీ అండ్ టీమ్ రెడీ అవుతోంది. చెన్నైలో మంగళవారం జరిగిన 'సర్దార్' సక్సెస్ మీట్ (Sardar Success Meet) లో చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.
Sardar Part 2 : 'ఒక్కసారి గూఢచారి అయితే... ఎప్పుడూ గూఢచారియే' (once a spy always a spy) - ఇదీ 'సర్దార్'కు కాప్షన్. సినిమాలో ఆ గూఢచారి మళ్ళీ విధుల్లోకి వస్తాడని మంగళవారం వెల్లడించారు. 'సర్దార్' పతాక సన్నివేశానికి కొనసాగింపు ఉంటుందని వెల్లడించారు. సీక్వెల్‌కు 'సర్దార్ : పార్ట్ 2' టైటిల్ ఖరారు చేశారు. ఆ చిత్రానికీ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. అందులోనూ కార్తీ కథానాయకుడిగా నటించనున్నారు.
ఇప్పుడు కార్తీ చేతిలో మూడు సీక్వెల్స్!
'సర్దార్ 2' కాకుండా కార్తీ చేతిలో మరో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. అందులో ముందు చెప్పుకోవాల్సింది 'ఖైదీ 2' గురించి! లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'ఖైదీ' చిత్రానికి తమిళంలో, తెలుగులో మంచి వసూళ్లు వచ్చాయి. అంతకు మించి పేరు వచ్చింది. కమల్ హాసన్ 'విక్రమ్' పతాక సన్నివేశాల్లోనూ 'ఖైదీ'లో కార్తీ ఢిల్లీ పాత్రను చూపించారు. 'ఖైదీ 2' ఎప్పుడో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తైన తర్వాత 'ఖైదీ 2' ఉండొచ్చు.
కార్తీ చేతిలో ఉన్న మరో సీక్వెల్ 'పొన్నియిన్ సెల్వన్ 2'. మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. ఆయనతో పాటు విక్రమ్, 'జయం' రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ప్రభు, లాల్, శరత్ కుమార్ తదితరులు నటించారు. 'పొన్నియిన్ సెల్వన్' పార్ట్ 1 సెప్టెంబర్ 30న విడుదల అయ్యింది. ఆల్రెడీ సీక్వెల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్ ఎలా చేశారు?
'సర్దార్' సినిమాకు వస్తే... ఇందులో రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తెలుగులో తొలిరోజు ఈ చిత్రానికి సుమారు కోటి రూపాయల షేర్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ సుమారు ఐదు కోట్ల రూపాయల షేర్ అందుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ బలంగా ఉంది. క్రిటిక్స్ రివ్యూస్ కూడా హెల్ప్ అయ్యాయి.
Karthi Upcoming Movies : 'పొన్నియిన్ సెల్వన్' తమిళంలో భారీ విజయం సాధించింది. నాలుగు వందల కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు 'సర్దార్' కూడా విజయం సాధించింది. దాంతో కార్తీ మార్కెట్ పెరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పుడు కార్తీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు సీక్వెల్స్ కాగా... మరొకటి రాజు మురుగన్ దర్శకత్వం వహించే సినిమా. ఈ నాలుగు కూడా తెలుగులో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.