Samantha: ఏడాది కాదు, 6 నెలలే - సమంతా బ్రేక్ తీసుకోడానికి అసలు కారణం ఇదేనట!
హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు కొంత కాలం పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మయోసైటిస్ చికిత్స కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాదిపాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సంవత్సరం బ్రేక్ కాదని, కేవలం 6 నెలలు మాత్రమే సమంతా బ్రేక్ తీసుకుంటుందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఇటీవల ‘శాకుంతంలం‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ‘ సినమాలో నటిస్తోంది. అటు ‘సిటాడెల్‘ వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కాగానే సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తోందట.
6 నెలల పాటు సినిమాలకు సమంత బ్రేక్
సమంత గత కొంత కాలంగా ‘మయోసైటిస్‘ వ్యాధితో బాధపడుతోంది. తొలుత కొద్ది రోజులు చికిత్స తీసుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి స్థాయిలో నయం అయ్యే వరకు ఎలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు చిత్రాలు మినహా మిగతా ఏ చిత్రాలకు అంగీకారం చెప్పడం లేదట. అయితే, గతంలో అంగీకరించిన కొన్ని సినిమాలను కూడా ఇప్పుడు చేసే పరిస్థితి లేకపోవడంతో తీసుకున్న అడ్వాన్సులను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వ్యాధి చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. "ఆమెకి ఇప్పుడు చాలా రెస్ట్ అవసరం. కానీ, ఆమె, ఒప్పుకున్న సినిమాలు పూర్తి చెయ్యాలన్న ఉద్దేశంతో రెస్ట్ లేకుండా షూటింగ్స్ పూర్తి చేసింది. దీంతో ఆమె ఆరోగ్యం సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో చికిత్స తీసుకోవాలని భావిస్తుంది” అని ఆమె సన్నిహితులు తెలిపారు.
‘యశోద’ షూటింగ్ సమయంలో ఆరోగ్య సమస్యలు
'యశోద' సినిమా షూటింగ్ సమయంలో ఆమెకి ఆరోగ్య సమస్యలు రావటంతో ఆ సినిమా పూర్తి చేసి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిందని, తరువాత మళ్ళీ ఇండియా వచ్చి సినిమాలు కంటిన్యూ చేసిందని వార్తలు వచ్చాయి. 'యశోద' విడుదల సమయంలో సమంత తనకి మయోసిటిస్ వ్యాధి సోకిందని, దాని నుంచి రికవరీ అవుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఆ వ్యాధితో చాలా బాధలు అనుభవించానని వివరించింది. మళ్ళీ కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకుని 'సిటాడెల్' (Citadel) వెబ్ సిరీస్ మొదలెట్టింది. ఆ తర్వాత 'ఖుషీ' సినిమా ప్రారంభించింది. ఇప్పుడు ఈ రెండు కూడా పూర్తి చేసి, హెల్త్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని భావిస్తోంది.
సమంత అప్పట్లో మయోసైటిస్ గురించి ఏం చెప్పిందంటే?
2022 లో, సమంత తనకు మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆమె ఇన్ స్టా వేదికగా పంచుకుంది. " ఈ విషయం గురించి నేను పూర్తిగా కోలుకున్నాక దీని గురించి మాట్లాడాలి అనుకున్నాను. కానీ, నేను అనుకున్నంత త్వరగా వ్యాధి నయం అయ్యేలా కనిపించడం లేదు. అన్ని సమయాల్లో మనం ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలని తెలుసుకున్నాను. ఈ సమస్య నుంచి పూర్తిగా బయట పడేందుకు నేను ఇంకా కష్టపడుతున్నాను. నేను త్వరలో పూర్తిగా కోలుకుంటానని డాక్టర్లు చెప్తున్నారు. నాకు మంచి రోజులతో పాటు చెడు రోజులతో సహవాసం చేసే అవకాశం వచ్చింది. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సమస్య నుంచి పూర్తిగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సమంత ‘ఖుషీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. మరో వారం రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ‘సిటాడెట్’ వెబ్ సిరీస్ షూటింగ్ లోనూ పాల్గొంటుంది. వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. రాజ్, DK దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందుతోంది.
Read Also: పాక్ క్రికెటర్‌తో తమన్నా పెళ్లా? మరి విజయ్ వర్మ పరిస్థితి ఏంటి?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

