Sai Pallavi: 'మగాళ్లు ఇంత అందంగా ఉంటారా?' స్టార్ హీరోపై సాయిపల్లవి కామెంట్స్!
రీసెంట్ గా సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
నటి సాయిపల్లవి(Sai Pallavi)కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆమెని అభిమానులు లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి ఇటీవల 'గార్గి' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తరువాత ఇప్పటివరకు సాయిపల్లవి మరో సినిమా సైన్ చేయలేదు. 'పుష్ప2'లో ఆమె నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది.
చాలా అనుమానాలుండేవి:
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు తనలో చాలా భయాలు ఉండేవని.. హీరోయిన్ మెటీరియల్ కాను.. ఇండస్ట్రీలో చోటు దక్కుతుందా..? అనే అనుమానాలు ఉండేవని చెప్పింది. 'ప్రేమమ్' సినిమాలో నటించేప్పుడు డైరెక్టర్ ని చాలా ప్రశ్నలు అడిగేదాన్ని అని.. 'మీ పాత్రకు నేను సరిపోతానా..? మధ్యలో నన్ను తీసేస్తారా..?' ఇలా దర్శకుడిని అడుగుతూనే ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది.
దర్శకుడు పుత్రేన్ తననో కాన్ఫిడెన్స్ పెంచడానికి చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చింది. ఫస్ట్ షాట్ ఓకే అయిన తరువాత కాన్ఫిడెన్స్ పెరిగిందని తెలిపింది సాయిపల్లవి. సినిమా రిలీజ్ తరువాత థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టారని.. ఆ సమయంలో ఇండస్ట్రీలో చోటు దక్కిందనిపించిందని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో 'ఫిదా', 'లవ్ స్టోరీ' సినిమాల గురించి మాట్లాడింది. తన కెరీర్ లో ఆ రెండు సినిమాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.
శేఖర్ కమ్ములకి రుణపడి ఉంటా:
'ఫిదా' అయితే తన ప్రయాణాన్ని మార్చేసిందని.. ఈ విషయంలో శేఖర్ కమ్ముల గారికి రుణపడి ఉంటానని చెప్పింది. ఆయన తన కెరీర్ తో పాటు.. ఆలోచనా ధోరణిని కూడా మార్చేశారని చెప్పింది. సెట్ లో ఎంతమంది ఉన్నా.. అందరినీ ఒకేలా చూసే నేచర్ ఆయనదని.. హీరో, హీరోయిన్లను ఒకేలా ట్రీట్ చేస్తారని చెప్పింది. ఆయన దృష్టిలో అందరూ సమానమేనని గొప్పగా మాట్లాడింది.
మగాళ్లు ఇంత అందంగా ఉంటారా..?:
సినిమాలు ఓకే చేసేప్పుడు హీరో ఎవరని చూడనని.. కథ నచ్చితేనే నటిస్తానని తెలిపింది. అయితే ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిపై గౌరవం ఉందని.. అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ చాలా నచ్చుతుందని.. ఆయన్ను చూసి 'మగాళ్లు ఇంత అందంగా ఉంటారా..?' అని ఆశ్చర్యపోతుంటానని చెప్పుకొచ్చింది. ఇదివరకు మహేష్ బాబుతో సాయిపల్లవి నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి కానీ .. అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి.
ఇప్పుడు సాయిపల్లవి మాటలు వింటుంటే.. మహేష్ తో సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లుంది. కానీ ఆయన సినిమాల లైనప్ చూస్తుంటే ఇప్పట్లో సాయిపల్లవికి ఆ అవకాశం రాదనిపిస్తుంది. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆ తరువాత రాజమౌళితో సినిమా చేయాలి. అలానే అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ ఇలా చాలా మంది యంగ్ డైరెక్టర్స్ మహేష్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also read: ఇనయా - సూర్యల మధ్య ఏం జరుగుతోంది? ప్రశ్నించిన నాగార్జున, ఇనయాకు క్లాస్?