Rajamouli: నెట్ ఫ్లిక్స్ చీఫ్‌ను కలిసిన జక్కన్న - SSMB29 కోసమేనా ఈ మీటింగ్?
భారత పర్యటనలో ఉన్న నెట్ ఫ్లిక్స్ చీఫ్ టెడ్ సరాండోస్ ను దర్శకధీరుడు రాజమౌళి కలిశారు. గత వారం ముంబైలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘SSMB 29‘ కొనుగోలు పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్టు ‘SSMB 29‘. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే రాజమౌళి చిత్రం మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మహేష్ కెరీర్‌లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన కథకు రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తుది రూపు ఇస్తున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లతో తెరకెక్కబోతున్నట్లు ఊహాగానాలు వినినిపిస్తున్నాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద బడ్జెట్ కావడం విశేషం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ జోనర్‌లో ఉండబోతోందని దర్శకుడు రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు.
నెట్ ఫ్లిక్స్ బాస్ తో జక్కన్న మీటింగ్
తాజాగా జక్కన్న నెట్ ఫ్లిక్స్ చీఫ్ టెడ్ సరాండోస్ ను కలిశారు. ఇండియా పర్యటనలో ఉన్న ఆయనను ముంబైలో మీటయ్యారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం ‘SSMB 29‘పై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అన్ని భాషా వెర్షన్లను కొనుగోలు చేయాలని జక్కన్న ఆయనను కొరారట. అటు త్వరలో ఈ డీల్ క్లోజ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ చీఫ్ సైతం ప్లాన్ చేస్తున్నారట.
నెట్ ఫ్లిక్స్ పై రాజమౌళి హాట్ కామెంట్స్
కొద్ది రోజుల క్రితం ‘RRR’ స్ట్రీమింగ్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ పై రాజమౌళి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి కేవలం హిందీ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారని, మిగిలిన 4 భాషలను తీసుకోలేదన్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ మీద కోపంగా ఉన్నట్లు చెప్పారు. అదే సమయంలో ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయినట్లు ఆయన వెల్లడించారు. తానొక మంచి కథ చెప్పాలనుకున్నానని, అది నెట్ ఫ్లిక్స్ కారణంగా అన్ని దేశాల ప్రజలకు రీచ్ అయ్యిందని చెప్పారు. విదేశాల్లోని సినీ అభిమానులు సైతం తన సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారని, దానికి కారణం నెట్ ఫ్లిక్స్ అన్నారు. అందుకే తాను నెట్ ఫ్లిక్స్ ను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు.
రాజమౌళి, నెట్ ఫ్లిక్స్ తో పని చేయనున్నట్లు ఊహాగానాలు
గతంలో నెట్‌ఫ్లిక్స్ తో రాజమౌళి కలిసి పని చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’కి ప్రీక్వెల్‌గా ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్‌ను మొదలుపెట్టింది. అనుకున్న స్థాయిలో స్క్రీప్ట్ వర్క్ జరగకపోవడంతో ఆ సిరీస్ ను పక్కన పెట్టింది. ఆ తర్వాత అతడితో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఆ వార్తలు ఏవీ కార్యరూపం దాల్చలేదు. కేవలం ఊహాగానాలుగా మిగిలిపోయాయి.
Read Also: ‘సార్’ సినిమాకు వసూళ్ల వర్షం, 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ధనుష్ మూవీ