Sridevi: శ్రీదేవి పెట్టిన ఆ కండిషన్ వల్లే ‘కొండవీటి దొంగ’ ఛాన్స్ మిస్? ‘బాహుబలి’కి మళ్లీ అదే రిపీట్!
శ్రీదేవి.. రెండు తరాల ప్రేక్షకులను అలరించిన అతిలోక సుందరి. ఆమె కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్, మరెన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయ్. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ‘కొండవీటి దొంగ’ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.
సుప్రీం హీరో నుంచి మెగాస్టార్‌గా మరింత స్టార్ డమ్ సాధించిన చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా ‘కొండవీటి దొంగ’. ఆనాటికి టాలీవుడ్ లో టెక్నికల్ గా ఉన్న హద్దులన్నీ చెరిపేస్తూ 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో 70mm లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన సినిమా ఇది. తరువాతి కాలంలో వచ్చిన డాల్బీ, డీటీఎస్ సౌండ్ లకు మూలం ఇదే. ఇప్పటికీ ఈ సినిమాను సరైన సౌండ్ క్వాలిటీ ఉన్న టీవీలోనో.. హోం థియేటర్లోనో చూస్తే సౌండింగ్ పరంగా దీని హై స్టాండర్డ్స్ తెలుస్తాయి. దానికి ఇళయరాజా మ్యూజిక్ తోడయ్యేసరికి ఆరోజుల్లో థియేటర్లే షేక్ అయిపోయాయి అని మెగాఫ్యాన్స్ ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు.
చిరంజీవి నటించిన కాస్ట్యూమ్ డ్రామాల్లో ఒకటైన ‘కొండవీటి దొంగ’కు సెపరేట్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశాన్ని శ్రీదేవి జారవిడుచుకున్నారు. శ్రీదేవి అప్పటికే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నారు. చిరంజీవితో అంతకు ముందు నటించినా ఈ సినిమా టైంకి వారిద్దరి రేంజ్ స్కై లెవెల్లో ఉంది. ఆ ఇద్దరినీ కలిపి కొండవీటి దొంగ సినిమాను తీస్తే అది ఒక టాలీవుడ్ లోనే గొప్ప సినిమాగా నిలిచిపోతుందని నిర్మాత త్రివిక్రమ రావు భావించారు. కథను శ్రీదేవికి చెప్పమని పరుచూరి బ్రదర్స్ ని పంపితే ఆమె సినిమా చేస్తాను. కానీ, రెండు కండీషన్‌లు ఉన్నాయని అన్నారట. ఒకటి సినిమా టైటిల్లో చిరంజీవి పేరుతో ‘కొండవీటి దొంగ’ ఎలా వస్తుందో.. అలాగే తన పాత్ర కూడా తెలిసేలా ‘కొండవీటి రాణి’ లాంటి పేరు సినిమాకు టైటిల్ కు జతచేయాలని అన్నారట. (ఈ సినిమా తర్వాత వచ్చిన ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’లో ఆ సూత్రాన్నే పాటించారు). ఇక రెండవ కండీషన్ గా తన పాత్ర అడవిలో హీరో వెంట పడినట్లు కాకుండా, హీరోనే తన వెంట తిరిగేలా ఉండాలని శ్రీదేవి అన్నారట.
శ్రీదేవి అలా అనేసరికి ఏం చేయాలో తెలియక రచయితలు నిర్మాతకు ఈ విషయం చెప్పారు. దీంతో కథను మార్చి విజయశాంతి, రాధా, శారద పాత్రలను చేర్చారు. 9, మార్చ్ 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ లో రూపొందిన టెక్నీకల్ వండర్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇప్పటికీ టాప్ క్లాస్ లో ఉంటాయి. తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కూడా ఒకేసారి ‘తంగమలై తిరుడన్’ పేరుతో రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.
కాకినాడలోని ఆనంద్ 70 mm థియేటర్ లో 107 రోజులపాటు హౌస్ ఫుల్ కలెక్షన్ లతో ఆడి రికార్డ్ సృష్టించింది. ‘‘శుభలేఖ రాసుకున్న ..’’, ‘‘చమకు చమక్ చాం’’ పాటలు ఎంత పెద్ద హిట్స్ అంటే.. వాటిని ఇప్పటికీ రీమేకులు చేస్తూనే ఉన్నారు చిరంజీవి నట వారసులు. మొదటివారమే రూ.కోటి 25 లక్షల గ్రాస్ కేవలం మొదటి వారం లోనే రాబట్టింది ఈ సినిమా. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో 4 ఆటలతో 100 రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇదే. అప్పటికే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ముందు చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం రెండు నెలల తర్వాత రిలీజ్ అయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా కోసం కొన్ని థియేటర్ ల నుంచి తప్పించాల్సి వచ్చింది. లేకుంటే ఇంకా చాలా రికార్డ్స్ సృష్టించేది ఈ సినిమా. ఇంత హిస్టరీ ఉన్న క్లాసిక్ ను చిన్న రీజన్ తో మిస్ చేసుకున్నారు శ్రీదేవి అని ఆమె అభిమానులు ఇప్పటికీ ఫీలవుతుంటారు.
‘బాహుబలి’ కూడా మిస్: కేవలం తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన మూవీ ‘బాహుబలి’. టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా చరిత్రను సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ లో కీలకమైన శివగామి పాత్రను కూడా శ్రీదేవి కొన్ని కండిషన్లు పెట్టి మిస్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళినే స్వయంగా ఒక ఇంటర్వూలో చెప్పారు. దానితో ఆమెను వద్దనుకున్నామని రాజమౌళి తెలిపారు. అయితే ఆ వ్యాఖ్యలను శ్రీదేవి ఖండించారు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ రమ్యకృష్ణను వరించింది. శ్రీదేవి ఆ పాత్రను పోషించి ఉండి ఉంటే.. ఈ తరానికి కూడా ఆమె తనలోని నటిని పరిచయం చేసే అవకాశం ఉండేది. మరో ఆల్ టైం బ్లాక్ బస్టర్ తో శ్రీదేవి పేరు జతచేరి ఉండేది. బాహుబలికి బదులు ఆమె విజయ్ తో కలిసి నటించిన తమిళ సినిమా ‘పులి’ డిజాస్టర్‌గా నిలిచింది. శ్రీదేవి తన కెరీర్‌లో చెయ్యని పాత్రంటూ ఏదీ లేదు. కానీ, అలాంటి అతిలోక సుందరి ఈ సినిమాల్లో కూడా చేసి ఉంటే.. ఆ సినిమాలకే అందం వచ్చేది. ‘‘ఉయ్ మిస్ యు’’ శ్రీదేవి గారు.
శ్రీదేవి మొత్తం 271 సినిమాల్లో నటించారు. వాటిలో 92 తెలుగు, 73 తమిళ్, 72 హిందీ, 25 మలయాళం, 5 కన్నడ చిత్రాల్లో నటించారు.