'ఆదిపురుష్'కు రూ.85 కోట్ల భారీ ఓపెనింగ్, పీవీఆర్ ఐనాక్స్ అంచనా
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్'..మరో రికార్డు సృష్టించబోతోంది. జూన్ 16న రూ. 80 నుండి 85 కోట్ల భారీ ఓపెనింగ్‌ను చూసే అవకాశం ఉందని పీవీఆర్ ఐనాక్స్ సీఈవో గౌతమ్ దత్తా వెల్లడించారు
Adipurush: ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్న 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ అయింది. ప్రభాస్, కృతి సనన్‌ల పౌరాణిక మాగ్నమ్ ఓపస్ 'ఆదిపురుష్' కు రిలేటెడ్ గా పీవీఆర్ ఐనాక్స్ సీఈవో గౌతమ్ దత్తా ఈరోజు ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 'ఆదిపురుష్' జూన్ 16న రూ. 80 నుండి 85 కోట్ల భారీ ఓపెనింగ్‌ను చూసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. 'ఆదిపురుష్' డే వన్ కలెక్షన్‌లో ఎక్కువ భాగం జంట తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుందని సీఈవో అభిప్రాయపడ్డారు. "సౌత్‌లో ప్రభాస్‌కి ఉన్న పాపులారిటీతో పాటు నార్త్ లోనూ సినిమాకు భారీ ఓపెనింగ్‌ని ఇస్తుంది" అని గౌతమ్ తెలిపారు.
ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పౌరాణిక డ్రామా 'ఆదిపురుష్' చిత్రానికి టిక్కెట్ పై రూ.50 పెంచేందుకు అనుమతిస్తూ కొత్త జీవోను జారీ చేశాయి. దీని ప్రకారం జూన్ 16 నుంచి పది రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లు రెండింటికీ టిక్కెట్ పెంపు వర్తిస్తుంది. ఈ ధరలు వరుసగా రూ. 236 రూ. 210 గా ఉండనున్నాయి. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టిక్కెట్లు హాట్‌కేక్‌లుగా అమ్ముడవుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆ బిగ్ డే దగ్గరకు వచ్చేసింది. ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ డైరెక్ట్ చేశారు. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఇప్పుడు దేశమంతా జై శ్రీరామ్ నినాదంతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అయింది.
బుక్ మై షో లో సెన్సేషనల్..
ఇక ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో 'ఆదిపురుష్' చిత్రం సెన్సేషనల్ ఫీట్ ని టచ్ చేసింది. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హైప్ ఉన్న సినిమాగా వచ్చిన చిత్రం 'పఠాన్' ని భారీ మార్జిన్ తో క్రాస్ చేసి ఈ ఏడాదిలో ఫస్ట్ 1 మిలియన్ ఇంట్రెస్ట్స్ పడిన మొదటి సినిమాగా 'ఆదిపురుష్' నిలిచింది. అలాగే ఇండియన్ సినిమా వద్ద రూ.10 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ కలిగిన అతి తక్కువ సినిమాల్లో ఒకటిగా ఆదిపురుష్ పేరు తెచ్చుకుంది. ఇప్పటివరకు, ప్రారంభ వారాంతంలో భారతదేశంలోని 3 ప్రముఖ మల్టీప్లెక్స్ లలో దాదాపు 4 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి.
గతంలో ప్రభాస్ బాహుబలి రెండు సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సాహో తో ప్లాప్ టాక్ లో కూడా రూ.400 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నాడు. ఇక నెక్స్ట్ రాధే శ్యామ్ మరింత పరాభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చూపెట్టేందుకు ప్రభాస్ సిద్దమయ్యాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఆదిపురుష్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడిగా రావణుడి పాత్రలో నటించారు. కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో జూన్ 16న రిలీజ్ కానుంది.