Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!
మారుతి దర్శకత్వంలో పని చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కథ మారిందట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న, చేయబోతున్న సినిమాల లైనప్ ఓ రేంజ్‌లో ఉంది. 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ... 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో సినిమాను ప్రభాస్ ఓకే చేశారు. మారుతి(Maruthi) దర్శకత్వంలో పని చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
Prabhas-Maruthi film undergoing major changes: నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. 'రాజా డీలక్స్' అనే పేరుని సినిమా టైటిల్ గా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు మారుతి ఈ సినిమా కోసం రాసుకున్న కథలో భారీ మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ప్రభాస్ తో మారుతి సినిమా అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.
ఇప్పటివరకు మారుతి మీడియం బడ్జెట్ సినిమాలు, మిడ్ రేంజ్ హీరోలతోనే సినిమాలు చేశారు. అలాంటిది ప్రభాస్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయగలరా.. అనే సందేహాలు కలిగాయి. మారుతి కూడా తనదైన స్టయిల్ లో ఓ హారర్ కామెడీ కథ రాసుకున్నారు. హారర్ సినిమాలకు కాలం చెల్లిన ఈ రోజుల్లో ప్రభాస్ తో అలాంటి సినిమా ఎందుకు చేయాలనుకున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్-మారుతి సినిమా కథ మొత్తం మారిపోయిందట.
హారర్ కామెడీ కాదు.. క్రైమ్ కామెడీ:
ఇది హారర్ సినిమా కాదు. ఓ క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా కథను రాసుకున్నారట. వజ్రాల దోపిడీ మెయిన్ ప్లాట్ గా సినిమా సాగుతుందట. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం కూడా కథలో మార్పులు చోటు చేసుకోవడమేనని చెబుతున్నారు. హారర్ కామెడీను కాస్త క్రైమ్ కామెడీగా మార్చేశారు. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారని టాక్.
కీలకపాత్రలో సంజయ్ దత్:
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt)ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే దర్శకనిర్మాతలు సంజయ్ దత్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ ను విలన్ రోల్ కోసం సంప్రదిస్తున్నారా..? లేక మరేదైనా పాత్రా..? అనే విషయంలో క్లారిటీ లేదు.
ఈ మధ్యకాలంలో సంజయ్ దత్ కి విలన్ గా ఆఫర్స్ బాగా ఎక్కువయ్యాయి. 'కేజీఎఫ్2' సినిమాలో కూడా ఆయన విలన్ గా కనిపించారు. రీసెంట్ గా దళపతి విజయ్ సినిమాలో ఆయన్ను విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. దానికి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. మరి ప్రభాస్ సినిమాలో నటించడానికి ఈ నటుడు ఎంత డిమాండ్ చేస్తారో చూడాలి..!
Also Read: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!
Also Read: ప్రభాస్, రామ్‌చరణ్‌లతో త్రివిక్రమ్ సినిమాలు - రివీల్ చేసిన నిర్మాత!