Prabhas: ‘ఆదిపురుష్’ ఎదురుదెబ్బతో ప్రభాస్ కీలక నిర్ణయం, ఆ డీల్స్ నుంచి వెనక్కి తగ్గినట్లేనా?
ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. థియేట్రికల్ డీల్స్ లోనూ కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ‘ఆదిపురుష్’ డిజాస్టర్ తో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘బాహుబలి’ చిత్రంతో రెబల్ స్టార్ ప్రభాస్ రేంజి ఊహించని స్థాయికి చేరింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటడంతో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. అంతేకాదు, తన సినిమాలకు సంబంధించిన బిజినెస్ డీల్స్ లో చురుగ్గా పాల్గొంటారు. థియేట్రికల్ ఒప్పందాల విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆయన రీసెంట్ మూవీ‘ఆదిపురుష్’ విషయంలో తన కజిన్ ప్రమోద్ కు సంబంధించిన యువి క్రియేషన్స్ కు లబ్ది చేకూరేలా వ్యవహరించాలి అనుకున్నారు. అయితే, ఈ సినిమా ‘బాక్సాఫీస్’ దగ్గర ఘోర పరాజయం చవిచూసింది. యువి క్రియేషన్స్ పైనా ఆ ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘సలార్’ బిజినెస్ డీల్స్ విషయంలో ప్రభాస్ సైలెంట్
తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కనీవినీ ఎరుగని రేంజిలో బిజినెస్ జరుగుతోంది. అయినప్పటికీ ప్రభాస్ సైలెంట్ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ విషయంలో జోక్యం చేసుకోకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమా నిర్మాణం కోసం ప్రొడ్యూసర్స్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో ధరలను కోట్ చేశారు. నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా పెద్దమొత్తంలో ధర పలికినట్లు టాక్ నడుస్తోంది. 'సలార్' ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దక్షిణాదితో పాటు హిందీ భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను సుమారు రూ.200 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ హక్కుల కోసం గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ కోసం పోటీ పడటంతో ధర భారీగా పలికే అవకాశం కనిపిస్తోంది.
సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందించారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా 'సలార్' మూవీ విడుదలకాబోతోంది. 'సలార్ పార్ట్ -1’ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Read Also: 'భోలా శంకర్' కోసం లాయర్‌గా మారిన మిల్కీబ్యూటీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial