Tamannaah: 'భోలా శంకర్' కోసం లాయర్‌గా మారిన మిల్కీబ్యూటీ!
తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్‘. ఇందులో ఆమె లాయర్ పాత్ర పోషించబోతున్నట్లు చెప్పింది. అయితే, ‘వేదాళం’ మూవీ క్యారెక్టర్ తో పోల్చితే చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు వివరించింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపొందుతోంది. మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఈ మూవీ గురించి పలు విషయాలు వెల్లడించింది.
లాయర్ పాత్రలో తమన్నా!
'భోలా శంకర్' సినిమాలో తన క్యారెక్టర్ ఏంటి అనే విషయాన్ని తమన్నా ప్రస్తావించింది. ‘వేదాళం’ చిత్రంలో శృతి హాసన్ పోషించిన పాత్రను ఈ చిత్రంతో ఆమె పోషిస్తున్నట్లు వివరించింది. అయితే, ఒరిజినల్ లో శృతి హాసన్ చేసిన క్యారెక్టర్ తో పోల్చితే తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని వెల్లడించింది. “నేను ‘భోళా శంకర్’ చిత్రంలో లాయర్ పాత్రను పోషిస్తున్నాను. ఇది పూర్తి నిడివి కలిగిన పాత్ర. ‘వేదాళం’ చిత్రంలో శృతి హాసన్ పోషించిన పాత్రను నేను ఇందులో చేస్తున్నాను. ఒరిజినల్ క్యారెక్టరైజేషన్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది” అని వివరించింది. ఇక ఈ సినిమా ‘వేదాళం’ చిత్రంతో పోల్చితే చాలా మార్పులతో తెరకెక్కుతున్నట్లు తమన్నా వెల్లడించింది. మూవీ థీమ్ మారకుండా తెలుగు ప్రేక్షకులకు తగినట్లుగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచినట్లు తెలిపింది. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో సాగనుందని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ సోదరిగా కనిపించనుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
వరుస సినిమాలతో మిల్కీబ్యూటీ ఫుల్ బిజీ
ఇక తమన్నా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన సినిమాలు వెబ్ సిరీస్ లు ఒకదాని వెంట మరొకటి విడుదల అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ 'జీ కర్దా', నెట్ ఫ్లిక్స్ 'లస్ట్ స్టోరీస్ 2' రీసెంట్ గా విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఈ రెండు సిరీస్ లలో గతంలో ఎప్పుడూ లేనంత బోల్డ్ గా కనిపించి ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘జైలర్’ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె బిజీగా గడుపుతోంది. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు మూవీస్ విడుదలకానున్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial