Horror Movies On OTT: హోటల్ 3వ ఫ్లోర్‌లో దెయ్యం, చెప్పినా వినకుండా వెళ్లి చూసిన అక్కాచెల్లెళ్లు - మూడున్నర రోజులు తర్వాత.. ఏం జరుగుతుంది?
Movie Suggestions: హోటల్ 3వ ఫ్లోర్‌లో దెయ్యం ఉంది, అక్కడికి వెళ్లొద్దు అని చెప్పినా కూడా వెళ్లి చూసిన అక్కాచెల్లెళ్లకు ఆ దెయ్యం మూడున్నర రోజులే టైమ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగుంటుంది?
Best Horror Movies On OTT: హోటల్‌లో దెయ్యం.. ఈ కాన్సెప్ట్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాల్లో దెయ్యం కామన్ అయినా.. వాటి వెనుక కథ మాత్రం డిఫరెంట్. అలాంటి డిఫరెంట్ కథతో తెరకెక్కిన ఇండోనేషియన్ హారర్ చిత్రమే ‘ది హాంటెడ్ హోటల్’ (The Haunted Hotel).
కథ..
1981లో ‘ది హాంటెడ్ హోటల్’ కథ మొదలవుతుంది. సెమరంగ్ అనే సిటీలో ఒక ఫేమస్ హోటల్ ఉంటుంది. అందులో పనిచేయడానికి నింగ్ అనే మహిళ వస్తుంది. హోటల్ ఓనర్ అయిన ముసలావిడ మాత్రం తనను రెండు ఫ్లోర్లు క్లీన్ చేయమని, 3వ ఫ్లోర్‌లోకి మాత్రం వెళ్లకూడదని చెప్తుంది. అలాగే అని రెండో ఫ్లోర్‌ను క్లీన్ చేస్తున్న సమయంలో తనకు 3వ ఫ్లోర్ నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటో చూద్దామని పైకి వెళ్లి అన్ని గదులను ఓపెన్ చేసి చూస్తుంది. చివరి గదిలో అద్దం ముందు కూర్చున్న దెయ్యాన్ని చూస్తుంది. దెయ్యం తనతో మూడున్నర రోజులు అని చెప్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని నింగ్.. వెంటనే బయటికి వచ్చేస్తుంది. మూడున్నర రోజుల పాటు నింగ్.. చాలా భయంకరమైన అనుభవాలను ఎదుర్కుంటుంది. చివరికి దెయ్యం చేతిలో దారుణంగా చనిపోతుంది.
కొన్నిరోజుల తర్వాత రైనా (లూనా మాయా), ఫే (బియాంకా హెలో) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఈ హోటల్‌కు వస్తారు. తమ తండ్రి చనిపోయే ముందు ఈ హోటల్ వాళ్లదేనని తెలుపుతాడు. దీంతో వారు ఆ హోటల్‌ను చూసేందుకు వస్తారు. అప్పటికీ వాళ్ల అమ్మమ్మ, తాతయ్య కలిసి ఈ హోటల్‌ను రన్ చేస్తుంటారు. మనవరాళ్లు ఇద్దరినీ 3వ ఫ్లోర్‌లోకి వెళ్లొద్దని హెచ్చరిస్తుంది అమ్మమ్మ. అయినా కూడా వాళ్లు వెళ్తారు. అక్కడ ఉన్న దెయ్యం.. వాళ్లకు కూడా మూడున్నర రోజులు టైమ్ ఇస్తుంది. అదే సమయంలో ఫేను స్కూల్‌లో జాయిన్ చేయడానికి వెళ్తుంది రైనా. అక్కడే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆర్డో (క్రిస్టియన్ సుగియోనో)ను కలుస్తుంది. ఆ హోటల్ గురించి ఆర్డోతో చెప్తుంది. అయితే ఆ హోటల్‌లో నింగ్ దారుణంగా చనిపోయిన విషయాన్ని రైనాకు చెప్తాడు. దీంతో వారిద్దరూ వెళ్లి అలా ఎందుకు జరుగుతుంది అని అమ్మమ్మ, తాతయ్యను నిలదీస్తారు. దీంతో వారు అసలు విషయం చెప్తారు.
హోటల్ 3వ ఫ్లోర్‌లో దెయ్యం ఉందని, ఇప్పటికే ఒక స్వామిజీని పిలిపించి చూపించినా కూడా ఏం లాభం లేకపోయిందని చెప్తారు. దీంతో రైనా, ఆర్డో కలిసి ఆ స్వామిజీని కలవడానికి వెళ్తారు. ఆ దెయ్యం చాలా పవర్‌ఫుల్ అని, దాని గురించి ఏమైనా వివరాలు తెలిసేవరకు తాను ఏం సాయం చేయలేనని చెప్పేస్తాడు స్వామిజీ. దీంతో 3వ ఫ్లోర్‌కు వెళ్లి దెయ్యం గురించి తెలుసుకోవాలనుకుంటారు. అక్కడ రైనాకు ఒక చించేసిన ఉత్తరం దొరుకుతుంది. అది తీసుకునే ప్రయత్నంలో దెయ్యం.. వారిని ముప్పు తిప్పలు పెడుతుంది. ఫైనల్‌గా వారు బయటపడతారు. అది ఒక లవ్ లెటర్, దాని ద్వారా ఆ దెయ్యం పేరు జాస్మిన్ అని తెలుస్తుంది. ఆ లెటర్‌లో తను ఒక రకమైన పువ్వుల గురించి రాస్తుంది. దీంతో ఆ పువ్వులను వెతుక్కుంటూ రైనా, ఆర్డో వెళ్తారు. అదే సమయంలో ఆ పువ్వులు ఉండే ఊరిలోని పెద్దమనిషిని కలుస్తారు. ఆయనను జాస్మిన్ గురించి అడుగుతారు. జాస్మిన్.. తమ కూతురే అని ఆయన భార్య చెప్తుంది.
జాస్మిన్‌కు చిన్నప్పటి నుండే ఒక వింత వ్యాధి ఉండేదని, దానివల్లే తనకు చిన్నప్పటి నుంచి తెల్లజుట్టుతో శరీరం అంతా తెల్లగా ఉండేదని తన తల్లి వివరిస్తుంది. దానివల్లే తనను అందరూ ఏడిపించేవారని, ఆఖరికి తల్లిదండ్రులుగా వారు కూడా తన బాధను అర్థం చేసుకోలేదని అంటుంది. దీంతో జాస్మిన్‌కు 20 ఏళ్లు వచ్చిన తర్వాత ఇంటి నుంచి పారిపోయిందని, ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని తన తల్లి చెప్తుంది. అలా ఇంటి నుంచి పారిపోయిన జాస్మిన్.. ఆ హోటల్‌లోకి ఎలా వచ్చింది, దెయ్యంలాగా ఎలా మారింది అన్నది తెరపై చూడాల్సిన కథ.
ఊహించని ట్విస్టులు..
‘ది హాంటెడ్ హోటల్’లో వచ్చే ట్విస్టులు.. ప్రేక్షకులను మరీ ఆశ్చర్యపరచకపోయినా.. ఊహించిన సమయంలో వస్తాయి కాబట్టి దాంతో వారు కాస్త థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు. కథలో తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి క్లైమాక్స్ వరకు ఉంటుంది. ఇక మామూలుగా హారర్ సినిమాల్లో ఉండే భయంకరమైన సీన్స్.. ఇందులో కూడా ఉన్నాయి. దెయ్యం అంటే పెద్ద జుట్టుతో తెల్లగా ఉంటుంది అని చాలాసార్లు వినే ఉంటాం. ఇందులో ఉండేది అలాంటి దెయ్యమే. ఒక డిఫరెంట్ కథ ఉన్న హారర్ మూవీని ట్రై చేయాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ‘ది హాంటెడ్ హోటల్’పై ఓ లుక్కేయండి.