Oka Pathakam Prakaaram OTT Streaming: ఓటీటీలో దూసుకెళ్తోన్న క్రైమ్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం' - విశాఖలో మర్డర్స్ మిస్టరీ...
Oka Pathakam Prakaaram OTT Platform: పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన 'ఒక పథకం ప్రకారం' మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. 2 రోజుల్లోనే మంచి వ్యూస్ సొంతం చేసుకుంది.

Sairam Shankar's Oka Pathakam Prakaaram Huge Response In OTT: సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఈ నెల 27 నుంచి (శుక్రవారం) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
రికార్డు వ్యూస్
ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో అందుబాటులో ఉండగా రెండు రోజుల్లోనే రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి వినోద్ విజయన్ దర్శకత్వం వహించగా... వినోద్ విజయన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. సాయిరాం శంకర్‌తో పాటు శ్రుతి సోధి, ఆషిమా నర్వాల్, భానుశ్రీ, సముద్రఖని, కళాభవన్ మణి, రవి పచ్చముత్తు, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ కీలక పాత్రలు పోషించారు.
విజేతలకు రూ.5 లక్షలు
ఈ మూవీ రిలీజ్ టైంలో సినిమా ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే రూ.10 వేలు ఇస్తామని యూనిట్ ప్రకటించగా... మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్‌కు ఒకరు చొప్పున 50 థియేటర్ల నుంచి 50 మందిని విజేతలుగా ఎంపిక చేసి రూ.5 లక్షలు ఇస్తామని తెలిపింది. మీడియా ప్రతినిధులకు వేసిన షోతో పాటు మిగతా థియేటర్లలో విజేతలకు డబ్బులు అందజేసింది.
మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజునట్లు నిర్మాతలు గార్లపాటి రమేష్, వినోద్ విజయన్ తెలిపారు. ఓటీటీ రెస్పాన్స్ అదిరిపోయిందని... ఓటీటీ రిలీజ్ ప్లానింగ్, ప్రొసీజర్స్ విషయంలో తమకు సహాయం చేసిన సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశి కిరణ్ నారాయణకి కృతజ్ఞతలు తెలిపారు.
స్టోరీ ఏంటంటే?
విశాఖలో వరుస హత్యల చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. సిద్ధార్ధ నీలకంఠ (సాయిరాం శంకర్) పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉంటాడు. ఆయన భార్య సీత (ఆషిమా నర్వాల్)తో షాపింగుకు వెళ్లగా ఆమె మిస్ అవుతుంది. దీంతో ఏమైందో తెలియక సిద్ధార్థ వేదనకు గురై డ్రగ్స్‌కు బానిసవుతాడు. అయితే... సిద్ధార్థ్‌తో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య (భాను శ్రీ) ఒక రోజు ఊహించని స్థితిలో దారుణ హత్యకు గురవుతుంది. ఈ మర్డర్ సిద్ధార్థే చేశాడని భావించిన ఏసీపీ రఘురాం (సముద్రఖని) అతన్ని కోర్టులో హాజరు పరుస్తాడు. సిద్ధార్థ్ స్థానంలో పీపీ కావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా అతన్ని ఇరికించే ప్రయత్నం చేస్తాడు.
స్వతహాగా లాయర్ అయిన సిద్ధార్థ్ తాను ఈ మర్డర్ చేయలేదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే టైంలో ఇదే తరహాలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. అసలు ఈ హత్యలకు కారణం ఏంటి? సిద్ధార్థ్ భార్య ఏమైంది? నిందితులను సిద్ధార్థ్ పట్టుకున్నాడా? సిద్ధార్థ్ ను ఇరికించేందుకు మరికొంత మంది ఎందుకు ప్రయత్నించారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఆద్యంతం ట్విస్టులతో ఆకట్టుకుంటోంది.





















