House of the Dragon Season2: ఆ సీన్స్ ఏవయ్యా? ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ఫ్యాన్స్ నిరుత్సాహం, సెన్సార్ చేసేస్తున్నారంటూ గగ్గోలు
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 17న తొలి ఎపిసోడ్ జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
House of the Dragon Season2: వెబ్ సిరీస్ లవర్స్ కు ‘గేమ్స్ ఆఫ్ థోన్స్’ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ ఏకంగా 8 సిరీస్‌లు ప్రసారమైంది. బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ గా నిలిచిన ‘గేమ్స్ ఆఫ్ థోన్స్’ కు ప్రీక్వెల్ గా ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ను తెరకెక్కించారు మేకర్స్. 2022లో విడుదలైన ఈ సిరీస్ ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంది. తాజాగా ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2ను జియో సినిమా సెన్సార్ చేస్తోందా?
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 విషయంలో జియో సినిమా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ పలు అభ్యంతరకర సన్నివేశాలను జియో సినిమా సెన్సార్ చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మ్యాక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జియో సినిమాలో ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ మ్యాక్స్ లో ఉన్న ఎపిసోడ్ కంటే తక్కువ డ్యూరేషన్ ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మ్యాక్స్ తొలి ఎపిసోడ్ నిడివి 58 నిమిషాలు ఉండగా, జియో సినిమాలో మాత్రం 55 నిమిషాలే ఉన్నట్లు గుర్తించారు. ఈ మూడు నిమిషాల సన్నివేశాలను జియో సినిమా భారతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సెన్సార్ చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
సెన్సార్ చేయలేదు, అది కేవలం టెక్నికల్ అంశమే - జియో సినిమా
అయితే, సెన్సార్ విషయంలో వస్తున్న ఊహాగానాలపై జియో టీమ్ స్పందించింది. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 తొలి ఎపిసోడ్ లో ఎలాంటి ఎడిటింగ్ లేదని వెల్లడించింది. ఒకవేళ డ్యూరేషన్ తగ్గి ఉంటే అది కేవలం టెక్నికల్ అంశం అవుతుందని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ టెక్నికల్ కారణాలు ఏంటి? అనే విషయంపై జియో సినిమా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం. వాస్తవానికి ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సీరిస్ అంటే.. హింస, బెడ్ సీన్స్‌లకు సెన్సార్ ఉండదు. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీరిస్‌లో అవేవీ లేవు.
జూన్ 17 నుంచి భారత్ లో స్ట్రీమింగ్
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2కు అలాన్ టేలర్ దర్శకత్వం వహించారు. మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డిఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌసైంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్ కార్నీ సహా పలువురు కీలక పాత్రలు చేశారు. ఈ నెల(జూన్)16 నుంచి మ్యాక్స్ ఓటీటీలో ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతుండగా, భారత్ లో జూన్ 17నుంచి జియో సినిమా వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇంతకీ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ కథ ఏంటంటే?
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ తొలి సిరీస్ లో కింగ్ విసెరీస్ టార్గారియస్ రాజుగా ఉంటారు. ఆయన తన కూతురు రెనెరియా టార్గారియస్ ను పాలనా వారసురాలిగా అనౌన్స్ చేస్తారు. ఆయన చనిపోయిన తర్వాత విసెరీస్ రెండో భార్య ఆలిసెంట్ తన కొడుకు ఏగాన్ టార్గారియన్ ను రహస్యంగా నూతన రాజుగా ప్రకటిస్తుంది. విసెరీస్ కూతురు రెనెరియా విషయం తెలుసుకుని తండ్రి చెప్పినట్లుగానే తనను రాణిగా ప్రకటించుకుంటుంది. ఇక రెండో సీజన్ లో ఐరన్ థ్రోన్ కోసం ఇద్దరి మధ్య యుద్ధం జరగనుంది. ఈ యుద్దంలో విజేతలుగా ఎవరు నిలుస్తారు? రాజ్యాన్ని ఎవరు దక్కించుకుంటారు? అనేది తెలియనుంది.