Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Kakinada port: తనపై లుకౌట్ నోటీసు జారీ కావడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. కాకినాడ పోర్టు విషయంలో సీఎం చంద్రబాబు, కేవీరావుపై త్వరలోనే పరువునష్టం దావా వేస్తానని తెలిపారు.
Ysrcp MP Vijaysai Reddy Anger On CM Chandrababu: ఏపీ రాజకీయాలు కాకినాడ పోర్టు (Kakinada Port) చుట్టే తిరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేసినప్పటి నుంచి ఈ టాపిక్ రాష్ట్రంలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తాజాగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy) ఏపీ సీఐడీ (AP CID) బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై విజయసాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు హయాంలోనే కాకినాడ పోర్టును ప్రైవేటుపరం..
కాకినాడ పోర్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రైవేటు పరం చేశారని విజయసాయి రెడ్డి విమర్శించారు. 1997 నుంచి కాకినాడ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదని, వైఎస్ జగన్‌పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతుందని ఆక్షేపించారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి.. కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదోక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ దుయ్యబట్టారు.
కేవీ రావుకు దొడ్డిదారిన కుర్చీ కట్టబెట్టారు...
కాకినాడ పోర్టు వ్యవహారంపై సీఎం చంద్రబాబు వైఖరిపై, అలాగే కేవీ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారని, ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారని విజయసాయి విమర్శించారు. మలేషియా ప్రధానమంత్రి మహాతీర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారని.. ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారని ఆరోపించారు. ఆయన్ను దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారని, ఈ వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలని, సీఎం చంద్రబాబు తన కనుసన్నల్లోని సీఐడీ ద్వారా కాకుండా కేంద్ర సంస్థ అయిన సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలని విజయసాయి డిమాండ్ చేశారు.
ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా..
ముఖ్యమంత్రి చంద్రబాబు 6 నెలల పాలన ప్రజలను మభ్య పెట్టడమే లక్ష్యంగా సాగుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. కేవీరావు ఒక బ్రోకరని, చంద్రబాబుకు అనుంగు శిష్యుడిలా వ్యవహరించాడని పేర్కొన్నారు. కేవీరావుకు అన్యాయం జరిగుంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించొచ్చని కానీ, అలా చేయలేదని గుర్తు చేశారు. కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారని, కేవీరావుకు ఫోన్ చేసినట్లు, బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు ఆడుతున్నారని, తనపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యవహారం ఇంతటితో తేల్చనని, కచ్చితంగా కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కాగా, కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బెదిరించి తన వద్ద నుంచి తక్కువ ధరకే లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.
Also Read: Google Andhra: ఏపీ యువతకు గూగుల్ నైపుణ్య శిక్షణ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం