Best Horror Movies On OTT: రోడ్డుపై తెగిపడిన అమ్మాయి తల, అక్కడి నుంచే అసలు కథ మొదలు - ప్రపంచంలోనే అత్యంత భయానక మూవీ ఇది
OTT Movie Suggestions: హారర్ సినిమాలను తెరకెక్కించడంలో హాలీవుడ్ మేకర్స్ దిట్ట. అలాంటి మేకర్స్, ప్రేక్షకులు అంతా కలిసి చాలా హై రేట్ ఇచ్చిన మూవీనే ‘హెరిడెటరీ’.
Best Horror Movies On OTT: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన హారర్ సినిమాల లిస్ట్ తీస్తే.. అందులో ‘హెరిడెటరీ’ (Hereditary) పేరు కచ్చితంగా ఉంటుంది. హారర్ సినిమాలను భయంకరంగా తెరకెక్కించడంలో హాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి హారర్ మూవీ లవర్స్ చాలామంది అత్యంత రేటింగ్ ఇచ్చిన చిత్రమే ‘హెరిడెటరీ’. తర్వాత ఏమవుతుంది అనే ఉత్కంఠ, భయపెట్టే సీన్స్.. అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. దాంతో పాటు ఒక ఫ్యామిలీ కథ కూడా ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఎవరూ ఊహించని సంఘటన జరగడం వల్ల వారందరి జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి.
కథ..
ఒక ముసలావిడలో మరణంతో ‘హెరిడెటరీ’ సినిమా మొదలవుతుంది. ఆమె దహన సంస్కారాలకు కూతురు ఆనీ (టోనీ కోలెట్), అల్లుడు స్టీవ్ (గ్యాబ్రియెల్ బైర్నీ), మనవడు పీటర్ (అలెక్స్ వాల్ఫ్), మనవరాలు చార్లీ (మిల్లీ షాపిరో) కూడా వస్తారు. మరణించిన తన తల్లి గురించి చెప్పడానికి ఆనీ దగ్గర మంచి విషయాలు ఏమీ ఉండవు. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆనీ తన కుటుంబంతో ఇంటికి వచ్చేస్తుంది. అప్పటినుంచి తన తల్లి ఆత్మ వెంటాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. మరోవైపు తన కూతురు చార్లీకి మొదటి నుంచి సైకిక్ సమస్య ఉంటుంది. తను ఎక్కువగా ఎవరితో కలవకుండా వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఒకరోజు అలాగే స్కూల్ నుంచి చనిపోయిన పావురం తల తీసుకొచ్చి దానికి ఏదో పూజలు చేస్తుంటుంది.
ఒకరోజు పీటర్.. తన ఫ్రెండ్స్ పార్టీకి వెళ్లడానికి ఆనీని కార్ అడుగుతాడు. కానీ చార్లీని కూడా తనతో తీసుకెళ్తేనే కారు ఇస్తానని ఆనీ చెప్తుంది. దీంతో వేరేదారి లేక తన చెల్లెలు చార్లీని కూడా పార్టీకి తీసుకెళ్తాడు పీటర్. పార్టీకి వెళ్లిన కాసేపటి వరకు అంతా బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి చార్లీకి ఊపిరి ఆడదు. దీంతో పీటర్.. తనను తీసుకొని స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. కారులో కూడా చార్లీకి ఊపిరాడకపోవడంతో తలను కిటికీలో నుంచి బయటపెడుతుంది. అప్పుడే పీటర్‌కు రోడ్డుపై ఏదో అడ్డుగా ఉన్నట్టు అనిపించి కారును ఒక్కసారిగా పక్కకు తిప్పుతాడు. దీంతో చార్లీ తల.. పక్కనే ఉన్న స్థంభానికి తగిలి.. తెగి పడిపోతుంది. షాక్‌లో ఉన్న పీటర్.. కారును ఇంటి దగ్గరే పార్క్ చేసి లోపలికి వెళ్లి పడుకుంటాడు. కారులోని చార్లీ మొండెం చూసి ఆనీ విపరీతంగా ఏడుస్తుంది. అక్కడ నుంచి వారి కుటుంబంలో వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి.
చార్లీ మరణంతో ఆనీ మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతుంది. అదే సమయంలో తనకు జోవాన్ (యాన్ డోడ్) అనే లేడీ పరిచయం అవుతుంది. ఆనీకి ఏం బాధ వచ్చినా తనతో వచ్చి చెప్పుకోమని అంటుంది. కొన్నిరోజుల తర్వాత తను చనిపోయిన మనవరాలు లూసీతో మాట్లాడానని, కావాలంటే చూపిస్తానని ఆనీని ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ జరిగింది చూడగానే ఆనీకి కూడా తన కూతురు చార్లీతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంటికి వెళ్లి స్టీవ్, పీటర్‌లతో జోవాన్ చెప్పినట్టు చేయిస్తుంది. కానీ మానసికంగా డిస్టర్బ్ అయిన ఆనీకి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. మరోవైపు చెల్లిని కోల్పోయిన పీటర్ కూడా అంతే మానసికంగా కుంగిపోతాడు. ఆ తర్వాత జోవాన్.. తనను ఏమార్చడానికి వచ్చిన మంత్రగత్తె అని, తను ఈవిల్ గాడ్‌ను తిరిగి తీసుకురావడం కోసం వీరిని టార్గెట్ చేసిందని ఆనీ తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే తెరపై చూడాల్సిన కథ.
చాలా డిస్టర్బింగ్ సీన్స్..
ఈ కథను చదువుతున్నప్పుడు మామూలుగానే అనిపించవచ్చు. కానీ ‘హెరిడెటరీ’ని చూస్తున్నంతసేపు ఒక కొత్త రకమైన హారర్ సినిమాను చూస్తున్న ఫీల్ మాత్రం కచ్చితంగా వస్తుంది. మిల్లీ షాపిరో చనిపోయినప్పటి నుంచి ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ కనిపిస్తుంటాయి. తెగిపడిన చార్లీ తలను చీమలు తినడం, పీటర్ నోట్లో నుంచి చీమలు రావడం, ఆనీ.. తన తలను తాను ఒక తాడుతో కట్ చేసుకోవడం.. ఇలాంటి సీన్స్ అన్నీ తెరపై చూస్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్‌గా ఉంటాయి. మీరు కూడా హాలీవుడ్‌లో హై రేటెడ్ హారర్ సినిమా అయిన ‘హెరిడెటరీ’ను చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో చూసేయవచ్చు.