My Dear Donga Trailer: ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
My Dear Donga Trailer: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు చాలా తక్కువ అని అంటుంటారు. అలాంటి ఒక తెలుగమ్మాయి హీరోయిన్‌గా నటించడం మాత్రమే కాకుండా తానే స్వయంగా రచయితగా వ్యవహరించిన సినిమా ‘మై డియర్ దొంగ’.
My Dear Donga Trailer Is Out Now: కొత్త కాన్సెప్ట్, అందులో నవ్వించే కామెడీ.. ఒక సినిమాలో ఈ కాంబినేషన్ ఉంటే చాలు.. చాలామంది ప్రేక్షకులు దానికి ఫిదా అయిపోతారు. దొంగతో ఫ్రెండ్‌షిప్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘మై డియర్ దొంగ’ అనే మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలావరకు అప్డేట్స్ బయటికొచ్చాయి. కొన్నిరోజుల క్రితం టీజర్ కూడా విడుదలయ్యింది. ఇవన్నీ చూస్తుంటే మూవీ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కడం మాత్రమే కాకుండా.. ఇందులో సరిపడా కామెడీ కూడా ఉందని అర్థమవుతోంది. ఇక తాజాగా ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి నవ్విస్తోంది.
స్టైలిష్ దొంగ..
ముందుగా ‘‘దొంగతో లవ్వా? ’’ అని ఒక బార్‌టెండర్ అడగగా.. ‘‘లవ్ స్టోరీలో దొంగ’’ అని హీరోయిన్ క్లారిటీ ఇచ్చే డైలాగ్‌తో ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత పోలీసులతో కలిసి స్టైల్‌గా పోలీస్ స్టేషన్‌లోకి ఎంటర్ అవుతున్న అభినవ్ గోమఠంను చూపిస్తారు. వాచ్‌మ్యాన్ పడుకుంటే అపార్ట్‌మెంట్‌లో దొంగతనాలు జరుగుతాయని సలహా ఇస్తూనే తానే ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటాడు అభినవ్. అలాగే ఒకరోజు హీరోయిన్ ఇంట్లోకి కూడా వెళ్తాడు. అది గమనించిన హీరోయిన్ షాలిని.. అభినవ్‌ను చితకబాదుతుంది. తన నుండి తప్పించుకోవడానికి ‘‘నేను ఎక్కువ ఏమీ తీసుకోలేదు. 2000, ఉప్పు, కందిపప్పు, మ్యాగీ, మాసాలా ఓట్స్’’ అని క్లారిటీ ఇస్తాడు. ఇలాంటి కామెడీ డైలాగ్స్.. ‘మై డియర్ దొంగ’లో చాలానే ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
దొంగతో ఫ్రెండ్‌షిప్..
ఇక ట్రైలర్‌లో షాలినితో గొడవపడడం అయిపోయిన తర్వాత అసలు తను దొంగగా ఎలా మారాడో చెప్తాడు అభినవ్. ‘‘డిగ్రీ కష్టపడి ఆరేళ్లు చదివాను. కానీ సరిగ్గా రాలేదు. అప్పటినుండి స్వయం ఉపాధి’’ అని అంటాడు. ఇలా ‘మై డియర్ దొంగ’ ట్రైలర్‌లో అభినవ్ గోమఠం చెప్పే ప్రతీ డైలాగ్ కామెడీగా అనిపిస్తుంది. ఇక షాలిని కూడా అప్పుడే తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవలు పడుతూ ఉంటుంది. అందుకే అభినవ్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాలని డిసైడ్ అవుతుంది. తన పేరు సుజాత అని పరిచయం చేసుకుంటుంది. అభినవ్ కూడా తన పేరు సురేశ్ అని చెప్తాడు. ‘‘దొంగతో ఫ్రెండ్‌షిప్ ఏంటి?’’ అని హీరోయిన్‌ను తన ఫ్రెండ్ అడగగా.. ‘‘మనుషులు దొంగలు కారా? దొంగలకు మనసు ఉండదా?’’ అంటూ డైలాగులు కొడుతుంది.
రియాలిటీకి దగ్గరగా డైలాగ్స్..
అభినవ్ క్యారెక్టర్ గురించి చెప్తూ ‘రాజా’ సినిమాలో వెంకటేశ్‌తో పోలుస్తుంది హీరోయిన్. ఇలాంటి ఇతర సినిమాల రిఫరెన్స్‌లు కూడా ‘మై డియర్ దొంగ’లో బాగా వర్కవుట్ అయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో ‘‘లవ్ అంటే ఎమోషన్ కాదు. ఇన్ఫర్మేషన్. ఎక్కడున్నావు? ఎప్పుడొస్తావు? ఎవరితో ఉన్నావు? లొకేషన్ షేర్ పంపించు అన్నట్టు ఉండాలి లవ్ అంటే’’ అంటూ బార్ టెండర్ చెప్పే డైలాగ్ రియాలిటీకి దగ్గరగా అనిపిస్తుంది. ఫైనల్‌గా ట్రైలర్‌తో ఆకట్టుకున్న ‘మై డియర్ దొంగ’.. ఏప్రిల్ 19 నుండి ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. ఇక ఇందులో హీరోయిన్‌గా నటించిన షాలిని.. ఈ సినిమాకు రైటర్‌గా కూడా పనిచేయడం విశేషం. బీఎస్ సర్వగ్న కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దివ్య, నిఖిల్ గాజులా, శశాంక్ మందూరి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
Also Read: ‘సుందరకాండ’ గ్లింప్స్ - కొత్త ప్రేమకథ చెప్తానంటున్న నారా రోహిత్