'IC 814' Row: వివాదంలో తమన్నా బాయ్ ఫ్రెండ్ వెబ్ సిరీస్- నెట్‌ఫ్లిక్స్ పై కేంద్రం ప్రభుత్వం సీరియస్
Naseeruddin Shah | నెట్ ఫ్లిక్స్ తాజా వెబ్ సిరీస్ 'IC 814' వివాదంలో చిక్కుకుంది. ఉగ్రవాదులకు హిందువుల పేర్లు పెట్టడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ కు సమన్లు జారీ చేసింది.
'IC 814' Web Series Row: ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు వివాదం అయినా, ఇప్పటికీ ఆ సంస్థ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఆ సంస్థ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చిన మరో వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది 'IC 814: కాందహార్ హైజాక్' సిరీస్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. 1999లో సంచలనం సృష్టించిన కాందహార్ విమాన హైజాక్ కథాంశంతో రూపొందించారు. ఆగస్ట్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాందహార్ విమానం హైజాక్ కథాంశంతో పలు సినిమాలు తెరకెక్కినా, ఇంత అద్భుతంగా చూపించలేదంటున్నారు.
వివాదంలో 'IC 814' వెబ్ సిరీస్
1999లో భారత్ కు చెందిన విమానాన్ని పాకిస్తాన్ కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్ అనే ఉగ్రవాదాలు ఈ విమాన హైజాక్ లో పాల్గొన్నారు. అప్పట్లో భారత ఇంటెలీజెన్స్ అధికారులు వీరి ఫోటోలను రిలీజ్ చేశారు. తాజాగా తెరకెక్కించిన 'IC 814' వెబ్ సిరీస్ లో మాత్రం ముస్లీం ఉగ్రవాదుల పేర్లకు బదులుగా హిందులు పేర్లు పెట్టడం తీవ్ర వివాదం అయ్యింది. వెబ్ సిరీస్ లో విమాన హైజాక్ లో పాల్గొన్న వారి పేర్లు భోళా, శంకర్, బర్గర్, డాక్టర్ అని పెట్టారు. వెబ్ సిరీస్ మేకర్స్ కావాలనే ముస్లిం పేర్లకు బదులుగా హిందువు పేర్లు పెట్టి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
'IC 814' వెబ్ సిరీస్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. భారతీయ ప్రసార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నెట్ ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. ఎందుకు పేర్లు మార్చాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ సమన్లకు నెట్ ఫ్లిక్స్ ఏ సమాధానం ఇస్తుందో? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు అభ్యంతరం చెప్పిన కేంద్రం, 'IC 814' వెబ్ సిరీస్ కు నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.
‘ఫ్లైట్ ఇన్ టూ ఫియర్’ బుక్ ఆధారంగా తెరకెక్కిన 'IC 814'
కాందహార్ హైజాక్ ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్ గా సంచలనం సృష్టించింది. 176 మంది ప్రయాణికులతో కాఠ్మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఐసీ 814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. పైలెట్ తలకు తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్‌కు తీసుకెళ్లాల్సిందిగా బెదిరిస్తారు. ఆ విమానాన్ని ఉగ్రవాదులు ఎందుకు హైజాక్ చేశారు. ఆ ఫ్లైట్ కాబుల్ కు ఎలా వెళ్లింది? కేంద్ర ప్రభుత్వం ఆ విమానాన్ని విడిపించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టింది. అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ, అరవింద్ స్వామి, కునాల్ చోప్రా, కరణ్ దేశాయ్ నసీరుద్దీన్ షా కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.