Nene Vasthunna OTT Release: ఓటీటీలోకి ధనుష్ కొత్త సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'నేనే వస్తున్నా' సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది.
తమిళ టాప్ హీరో ధనుష్ నటించిన సినిమా 'నానే వరువెన్' కొన్నాళ్లక్రితం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో 'నేనే వస్తున్నా' అనే టైటిల్ తో సినిమా విడుదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశారు. కోలీవుడ్ లో ఓకే అనిపించిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. అక్టోబర్ 27 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇందులో ధనుష్‌కు జోడీగా ఎల్లి ఆవ్రమ్ నటించింది. సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధనుష్ రెండు పాత్రలు పోషించారు. ఒకటి హీరో పాత్ర కాగా, మరొకటి విలన్ రోల్.
తన తమ్ముడు ధనుష్ కథానాయకుడిగా 'కాదల్ కొండేన్', 'పుదు పేట్టై', 'మయక్కం ఎన్న' మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు సెల్వ రాఘవన్. అన్నదమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రమిది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకు ఇద్దరూ కలిసి కథ రాశారు. తొలుత 'పుదు పేట్టై 2' చేయాలనుకున్నా... తర్వాత ఆ ఆలోచన పక్కన పెట్టేసి, ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. థియేటర్లో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసుకోవచ్చు.
a war between the light and the shadow ☄ #NaaneVaruvenOnPrime, Oct 27@theVcreations @dhanushkraja @selvaraghavan @thisisysr @omdop @RVijaimurugan @theedittable @saregamasouth pic.twitter.com/i44cdRTfz7
— prime video IN (@PrimeVideoIN) October 22, 2022
ప్రస్తుతం ధనుష్ తెలుగులో 'సార్' అనే సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇందులో ధనుష్ 'బాల గంగాధర్ తిలక్' అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అతడి లుక్ కూడా చాలా నేచురల్ గా ఉంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్(Samyuktha Menon) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు స్ట్రెయిట్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తుండడంతో.. మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ ఏడాది డిసెంబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్