Nayanthara's Connect Movie : ఫుడ్ బిజినెస్‌కు నయనతార సినిమా దెబ్బ కొడితే ఎలా?
Connect Movie Telugu Review : నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'కనెక్ట్' చిత్ర బృందం నిర్ణయానికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
నయనతార (Nayanthara) మాటకు దర్శక నిర్మాతలు ఎదురు చెప్పరనేది ఇటు తెలుగు, అటు తమిళ చిత్రసీమలో వినిపించే మాట. తాను పెట్టిన కండిషన్లకు ఓకే అంటేనే ఆవిడ సినిమా చేస్తుందని టాక్. ఇప్పుడు నయనతార అండ్ టీమ్ పెట్టిన ఓ కండిషన్‌కు థియేటర్ యాజమాన్యాలు ఓకే అనడం లేదు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, అటు తమిళనాడులో నయనతార అండ్ టీమ్ నుంచి వస్తున్న ఓ నిర్ణయానికి పూర్తిస్థాయిలో ఆమోదముద్ర లభించడం లేదు. అసలు వివరాల్లోకి వెళితే...
ఇంటర్వెల్ లేకుండా...
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'కనెక్ట్' (Connect Movie). దీని నిడివి ఎంతో తెలుసా? 99 నిమిషాలు! అంటే... గంటన్నరకు ఓ పది నిమిషాలు ఎక్కువ. ఇంటర్వెల్ లేకుండా సినిమాను ప్రదర్శించాలని టీమ్ అనుకుంటోంది.
'కనెక్ట్'కు నిర్మాత ఎవరో కాదు... నయనతార భర్త, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్. ఓ ఇంటర్వ్యూలో ''ఇంటర్వెల్ లేకుండా సినిమా చూస్తే బావుంటుంది. అప్పుడు కథ ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది'' అని ఆయన చెప్పారు. తమ చిత్ర బృందానికి ప్రయోగం చేయాలని ఉందని తెలిపారు. అయితే... ఈ నిర్ణయం పట్ల థియేటర్ యాజమాన్యాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఒప్పుకోవడం లేదు.
ఫుడ్ బిజినెస్‌కు దెబ్బ!
సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు... అన్నిటికీ ఇంటర్వెల్ చాలా ముఖ్యం. వై? ఎందుకు? అంటే... ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు పాప్ కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ వగైరా వగైరా కొనుగోలు చేస్తారు. ఆ బిజినెస్ చాలా పెద్దది. అందువల్ల, సినిమా మధ్యలో నో బ్రేక్ అంటే థియేటర్లు ఒప్పుకోవడం లేదు. తమిళనాడులో గానీ, ఏపీలో గానీ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు టికెట్లు అమ్మాలి. తమకు ఎంతో కొంత ఆదాయం స్నాక్స్, కూల్ డ్రింక్స్ ద్వారా అమ్మడం వల్ల వస్తున్నాయని వాళ్ళు చెబుతున్నారట.
Also Read : రాశీ ఖన్నా క్రష్ ఎవరో తెలుసా? బాలకృష్ణ అడిగితే చెప్పాల్సిందే మరి
తెలుగు, తమిళ భాషల్లో గురువారం 'కనెక్ట్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ తమిళనాడులో ప్రీమియర్ షో వేశారు. తెలుగు మీడియా ప్రతినిధులకు ఈ రోజు చూపిస్తున్నారు. 'కనెక్ట్' సినిమా సూపర్ ఉందని చెన్నైలో ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్వీట్లు చేశారు. విజువల్స్, సౌండ్ డిజైన్ ఎక్స్‌లెంట్ అంటున్నారు. అయితే... కథ విషయంలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. చిన్న పాయింట్ పట్టుకుని దర్శకుడు అశ్విన్ శరవణన్ సినిమా తీశారని బావుందని చెబుతున్న ప్రేక్షకులు సైతం ట్వీట్లు చేయడం గమనార్హం. థియేటర్లలో సినిమా చూడాలని అందరూ చెబుతున్నారు.
'కనెక్ట్' కోసం నయనతార స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగులో సుమ కనకాల (Suma Kanakala), తమిళంలో దీదీ నీలకంఠన్ (దివ్యదర్శని) ఇంటర్వ్యూ చేశారు. త్వరలో ఇది విడుదల కానుంది. సాధారణంగా నయనతార ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'అనామిక' విడుదలైనప్పుడు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడీ సినిమా కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో యూవీ క్రియేషన్స్ విడుదల చేస్తోంది. భర్త కోసం నయనతార ఇంటర్వ్యూ ఇచ్చారేమో!?
Also Read : హీరోపై చెప్పుతో దాడి - పునీత్ రాజ్‌కుమార్ బతికుంటే సపోర్ట్ చేసేవాడా?
'కనెక్ట్'లో సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'కార్తికేయ 2'లో అనుపమ్ కనిపించారు. తమిళంలో ఆయన ఇంతకు ముందు ఓ సినిమా చేశారు. అయితే, పదిహేనేళ్ల తర్వాత ఆయన నటించిన తమిళ సినిమా 'కనెక్ట్' కావడం విశేషం. 'వాన' హీరో వినయ్ రాయ్, చైల్డ్ యాక్టర్ హనియా నఫీసా కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందించగా... మణికంఠన్ రామాచారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వరించారు.