Tuck Jagadish Trailer: ‘టక్ జగదీష్’ ట్రైలర్.. ఆస్తులు కాదు రక్తసంబంధం విలువ తెలుసుకో!
‘టక్ జగదీష్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సారి టీజర్ కంటే భిన్నంగా.. భావోద్వేగ సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు.
నానీ హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ‘టక్ జగదీష్’ సినిమాను విడుదల చేయనున్నట్లు.. ఇటీవలే ప్రకటించారు. ‘‘నాయుడుగారి చిన్నబ్బాయి టక్ జగదీశ్ చెబుతున్నాడు.. మొదలెట్టండి’’ అనే డైలాగ్ ప్రోమోతో తేదీని ఖాయం చేశారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకుంటున్నాయి. సినిమా విడుదల దగ్గరపడటంతో బుధవారం ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో టక్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. భావోద్వేగ సన్నివేశాలతో గుండె బరువెక్కించాడు. ఈ చిత్రంలో నానికి అన్నగా జగపతిబాబు కనిపించనున్నారు. అయితే, వీరిద్దరు ఒకే తల్లి బిడ్డలు కాదని తెలుస్తోంది. భూదేవిపురం ప్రజలను వేదిస్తున్న విలన్‌తో పోరాట సన్నివేశాలు కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ‘‘అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు. రక్త సంబంధం విలువ తెలుసుకో’’ అనే జగపతి బాబు డైలాగ్ ఆకట్టుకుంటుంది. అలాగే.. చివర్లో ‘‘బాబాయ్ నువ్వు మా ఫ్యామిలీ కాదా?’’ అని చిన్నారి అడిగే ప్రశ్నకు.. నాని ‘‘తెలియట్లేదమ్మా’’ అంటూ భావోద్వేగానికి గురయ్యే సన్నివేశంతో ట్రైలర్ ముగిసింది.
‘టక్ జగదీష్’ ట్రైలర్:
కరోనా సీజన్ మొదలైన తర్వాత నుంచి నాని తన సినిమా నిర్మాతలు ఓటీటీలో విడుదలకే మొగ్గు చూపుతున్నారు. గతంలో విడుదల చేసిన ‘వి’ సినిమా నానికి చేదు అనుభవమే మిగల్చింది. అయితే, ‘టక్ జగదీష్’ మీద భారీ అంచనాలే ఉండటంతో మరోసారి ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే, నాగచైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదల రోజే.. ఈ చిత్రాన్ని విడుదల చేయడంపై ఇటీవల ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ‘టక్ జగదీష్’ నిర్మాతలు ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదంటూ పట్టుదలగా సెప్టెంబరు 10నే ‘టక్ జగదీష్’ విడుదల చేస్తామని ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ సినిమాలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.
Also Read: టాలీవుడ్ డర్టీ పిక్చర్‌లో ఊహించని ట్విస్ట్.. డ్రగ్స్ కేసులో లొంగిపోయిన కీలక నిందితుడు
Also Read: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..