Yohani De Silva: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?
‘మణికే మాగే హితే..’ పాటతో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న యోహానీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు.
టిక్‌టాక్.. యూట్యూబ్ షార్ట్స్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఎక్కడ చూసినా ఆ అమ్మాయి పాటే. హస్కీ వాయిస్‌తో వినేకొద్ది వినాలనిపించేలా ఆమె పాడిన పాట.. ఖండాలను సైతం దాటేసింది. సంగీతానికి సరిహద్దులు ఉండవని నిరూపించింది. కొద్ది నెలల్లో కేవలం య్యూట్యూబ్‌లోనే సుమారు 75 మిలియన్ వ్యూస్ సంపాదించింది. వీరిలో మళ్లీ మళ్లీ వినేవారి సంఖ్యే ఎక్కువ. ‘‘మణికే మాగే హితే..’’ అంటూ సాగే ఈ పాటలోని భావం ఎవరికీ అర్థం కాకపోవచ్చు. కానీ, ఆమె గాత్రంలోని మాధూర్యం మాత్రం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. అప్పుడే పాట అయిపోయిందా అనిపిస్తుంది. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఈ పాటకు లభిస్తున్న ఆధరణతో దీన్ని ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు.
అన్నట్లు ఈ పాటను ఆలపించిన గాయని గురించి చెప్పనే లేదు కదూ. ఆమె పేరు యోహాని డి సిల్వా (Yohani De Silva). శ్రీలంకకు చెందిన ర్యాపర్.. ఈ పాట విడుదలకు ముందే పాపులర్ గాయనిగా పేరొందింది. అయితే, ‘‘మణికే మాగే హితే’’ పాట మాత్రం.. ఆమెను రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ స్టార్‌ను చేసేసింది. యోహాని సహగాయకుడు గాయకుడు-పాటల రచయిత సతీష్‌తో కలిసి ఈ పాటను ఆలపించింది. ఈ ఏడాది మే 22న ఆమె ఈపాటను తన యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. అది హిట్ కావడంతో శ్రీలంక, ఇండియాలకు సైతం పాకింది. వివిధ దేశాల్లో కూడా ఈ పాట మారుమోగుతోంది.
ఈ పాట ఒరిజినల్ వెర్షన్ సింహళంలో ఉంది. ఆ పాటలో అర్థం కూడా చాలామంది తెలియదు. కానీ, యొహానీ వాయిస్, సంగీతం వల్ల ఆ పాట ఎంతోమంది మనసులను తాకింది. ఆ పాటలు ఆమె పలికే ఎక్స్‌ప్రెషన్స్ కూడా నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఫలితంగా ఆమె పాటను 75 మిలియన్‌కు మంది వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #ManikeMageHite అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఒరిజినల్ సాంగ్ కంటే కవర్ సాంగ్‌కే ఎక్కువ వ్యూస్ : యోహాని డి సిల్వా పాడిన ‘మణికే మాగే హితే’ సాంగ్ శ్రీలంకలో చరిత్ర సృష్టించింది. శ్రీలంకలో ఇప్పటివరకు ఏ యూట్యూబర్‌కు అంత తక్కువ సమయంలో రానటువంటి వ్యూస్ ఆమె వీడియోకు లభించాయి. యోహనీ శ్రీలంకలో ఒక మిలియన్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న మొదటి మహిళా గాయనిగా కూడా రికార్డులకు ఎక్కింది. అయితే, ఇండియా, బంగ్లాదేశ్‌లో ఆమె పాటకు వచ్చిన ఆధరణ వల్లే యోహాని ఆ రికార్డులను చేరుకోగలిగింది. ఈ పాటను ఇప్పుడు చాలామంది టాలెంట్ పోటీలు, రియాలిటీ షోల్లో కూడా ఆలపిస్తున్నారు. వాస్తవానికి ‘మణికే మాగే హితే’ సాంగ్ సతీషన్ రత్నాయక అనే సింగర్ పాడిన పాట. 2020, జులై నెలలో ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీనికి చమత్ సంగీత్ సంగీతం అందించాడు. మే 2021లో కవర్ వెర్షన్‌గా యోహాని మళ్లీ పాడింది. ఈ పాటను ఇప్పుడు తమిళం, మలయాళం వెర్షన్లలో కూడా విడుదల చేశారు.
ఇండియాలో యమ పాపులర్.. అమితాబ్ సైతం ఫిదా: సిద్దార్థ్ నిగమ్ అనే భారతీయ నటుడు యోహానీ పాటను ఓ షార్ట్ వీడియో రూపొందించారు. అది క్రమేనా వైరల్‌గా మారడంతో అంతా ఆ పాటతో షార్ట్ వీడియోలు (టిక్‌టాక్ తరహా వీడియోలు) చేయడం మొదలుపెట్టారు. చివరికి బాలీవుడ్ స్టార్లను సైతం ఈ పాట ఫిదా చేస్తోంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సైతం ఈ పాట గురించి స్పందించకుండా ఉండలేకపోయారు. వినూతన రీతిలో ఆయన ఈ పాటను తన పాత చిత్రంలోని ఓ పాటతో మిక్స్ చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘క్యాకియా.. క్యా హోగయా’’ అనే క్యాప్షన్‌తో ఆయన ‘కాలియ’ సినిమాలోని డ్యాన్స్ సీక్వెన్స్ వీడియోను పంచుకున్నారు. అందులోని ఒరిజనల్ పాట ‘‘జహాన్ తేరీ యే నజర్ హై..’’ స్థానంలో ‘‘మణికే మాగే హితే’’ పాటను మిక్స్ చేశారు. ఆ పాట అమితాబ్ స్టెప్పులకు భలే సరిపోయింది. ఈ పాటను ఆ పాటను తన మనుమరాలు నవ్య ఎడిట్ చేసిందని, ఈ పాటను వినకుండా ఆపడం అసాధ్యం! ఎంతో అద్భుతమైనది’’ అని అమితాబ్ కొనియాడారు.
సైనికాధికారి కూతురు: 28 ఏళ్ల యోహాని శ్రీలంకలోని కొలంబోలో పుట్టింది. యోహానీ యూట్యూబర్‌గా తన సంగీత జీవితాన్ని ఆరంభించింది. కొద్ది రోజుల్లోనే ఆమె ‘దేవియాంగే బేర్’ అనే ర్యాప్ కవర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యోహానీకి ‘ర్యాప్ ప్రిన్సెస్’ అనే బిరుదు కూడా లభించింది. ఆమె శ్రీలంక రికార్డ్ లేబుల్ ‘పెటా ఎఫెక్ట్’ ద్వారా కనుగొనబడింది, ఇది అనేక గాన సహకారాలకు దారితీసింది. ఆమె వారితో పాప్ హిట్స్ (అల్టిమేట్ మాషప్ కవర్) రికార్డ్ చేసింది, ఇది గొప్ప విజయానికి దారితీసింది మరియు రాయగామ్ అవార్డు వేడుకలో ‘ఉత్తమ వీడియో రీమేక్’ అవార్డును గెలుచుకుంది. 23 వీడియోలతోనే ఆమె 1.8 మిలియన్ సబ్‌స్క్రైబర్లను సాధించగలిగింది. యోహాని రిటైర్డ్ మేజర్ జనరల్ ప్రసన్న డి సిల్వా కూతురు. యోహాని కొలంబోలోని విశాఖ విద్యాలయంలో చదివింది. జనరల్ సర్ జాన్ కొఠాలవాలా డిఫెన్స్ యూనివర్సిటీలో లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌లో బీఎస్‌సీ చదివింది. ఆస్ట్రేలియాలో అకౌంటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని సంపాదించింది.
‘మణికే మాగే హితే’ కవర్ సాంగ్:
‘మణికే మాగే హితే’ ఒరిజనల్ సాంగ్:
Also Read: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?
Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?