Nagarjuna: కంటెంట్ ఉంటే ఎన్ని సినిమాలైనా రావొచ్చు - 'గాడ్ ఫాదర్'తో పోటీపై నాగ్ కామెంట్స్!
గత రెండు దశాబ్దాల్లో చిరంజీవి, నాగార్జున ఇలా తలపడింది లేదు. అయితే ఈ క్లాష్ ని ఇద్దరు హీరోలు ప్రొఫెషనల్ గానే చూస్తున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. చిరు, నాగార్జున మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇద్దరూ సీనియర్ హీరోలే. అయితే ఇప్పుడు వీరిద్దరూ పోటీ పడడానికి రెడీ అవ్వడం చర్చకు దారి తీసింది.
అయితే నాగార్జున వెనక్కి తగ్గుతారని అందరూ అనుకున్నారు. కానీ రిలీజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది 'ది ఘోస్ట్' టీమ్. ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని నిర్మాతలు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. రీసెంట్ గా సినిమాలో ఓ పాటను కూడా రిలీజ్ చేశారు.
గత రెండు దశాబ్దాల్లో చిరంజీవి, నాగార్జున ఇలా తలపడింది లేదు. అయితే ఈ క్లాష్ ని ఇద్దరు హీరోలు ప్రొఫెషనల్ గానే చూస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇంకా మీడియా ముందుకు రాలేదు కానీ.. ఆయన కంటే ముందు తన సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాను కలిసిన నాగార్జున.. చిరుతో క్లాష్ గురించి మాట్లాడారు. చిరంజీవిని చాలా మంది ఇష్టపడతారని.. ఇద్దరి సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
దసరా సమయంలో ఒకేసారి రెండు, మూడు సినిమాలు విడుదల కావడం గత నలభై ఏళ్లుగా జరుగుతుందని.. సినిమా బాగుంటే పోటీకి ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ సినిమాల సక్సెస్ ఈ ఇద్దరి హీరోలకు చాలా ముఖ్యం. మరి ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి!
చిరు 'గాడ్ ఫాదర్' సినిమా విషయానికొస్తే.. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కథ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. అలానే చిరు, సల్మాన్ ల కాంబినేషన్ లో ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది.
మలయాళంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohan lal) నటించిన 'లూసిఫర్'కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. . పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసిఫర్' చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. అదే రేంజిలో ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.
Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!
Also Read : ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?