Priyanka Mohan: ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?
రజనీకాంత్ తో నటించే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఆయనతో సినిమా చేస్తే కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందని భావిస్తారు. ఓ హీరోయిన్ మాత్రం ఆయన సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నటుడు రజనీకాంత్. తన అద్భుతమైన నటనతో భారత్ తో పాటు విదేశాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రజనీ. ఆయనతో సినిమాలు చేసేందుకు ఎంతో మంది దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. దక్షిణా సినిమాల్లో నటించే హీరోయిన్లు సైతం రజనీతో నటించాలని కలలు కంటారు. కానీ, ఓ హీరోయిన్ మాత్రం ఆయన తాజా సినిమా ‘జైలర్’ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంది అనేది హాట్ టాపిక్ అవుతోంది.
ఆ హీరోయిన్‌కు మంచి అవకాశాలు
తలైవా రజనీ కాంత్ సినిమా నుంచి వైదొలిగిన హీరోయిన్ మరెవరో కాదు.. నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రియాంక మోహన్. ఇప్పటికే తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కోలీవుడ్ లో ‘డాక్టర్’ అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం అదే సినిమా హీరోతో కలిసి ‘డాన్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. రెండు సినిమాలు వరుసగా హిట్ కావడంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ టాప్ హీరో సూర్యతో కలిసి ‘ఎదుర్కుమ్ తుణిందవన్’ అనే సినిమా చేసింది. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. అయినా ఆమెకు తమిళ సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలే లభిస్తున్నాయి.
తాజాగా ఈ ముద్దుగుమ్మకు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘జైలర్’లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. నెల్సన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నది. ఇందులో రజనీ కాంత్ డ్యుయెల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు మూవీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రజనీ మూవీ నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నది? అనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రియాంక మోహన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి అసలు కారణం దర్శకుడు నెల్సన్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్నది. ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన తొలి సినిమా ‘డాక్టర్’ దర్శకుడు నెల్సనే. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య కొన్ని విషయాల్లో గొడవలు అయ్యాయట. ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అయినట్లు తెలుస్తున్నది. దీంతో ప్రియాంక మోహన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇటు ప్రియాంక గానీ, అటు దర్శకుడు నెల్సన్ గానీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ‘జైలర్’ సినిమా నుంచి ప్రియా మోహన్ తప్పుకోవడంతో.. ఆ స్థానంలో తమన్నా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రియాంక మోహన్ ప్రస్తుతం రాజేష్, జయం రవి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నది.