Mohan Babu: భద్రతా కారణాలతో అయోధ్యకు వెళ్లలేదన్న మోహన్ బాబు - మండిపడుతోన్న నెటిజన్స్
Mohan Babu: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానం అందినా, భద్రతా కారణాలతో వెళ్లలేదన్నారు మోహన్ బాబు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
Mohan Babu’s Security Threat Comments: కోట్లాది మంది హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం పూర్తయ్యింది. జనవరి 22న అయోధ్య ఆలయంలో బాలరాముడు కొలువుదీరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చైర్మన్ చేతుల మీదుగా ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఈ వేడుకను తిలకించేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అయోధ్య నగరానికి తరలి వచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం మేరకు సుమారు 11 వేల మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు కూడా ఆహ్వానం అందింది.
ఆహ్వానం ఉన్నా అయోధ్యకు వెళ్లని మోహన్ బాబు
అటు అయోధ్యకు రావాలని ఆహ్వానం ఉన్నా, భద్రతా కారణాలతో వెళ్లలేకపోయానని మోహన్ బాబు తెలిపారు. “నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక భారతీయ, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆయన ప్రధాని అయ్యాక దేశ ప్రతిష్ట పెరుగుతోంది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు రావాల్సిందిగా తనకు కూడా ఆహ్వానం అందించారు. అయితే, భద్రతా కారణాల వల్ల రాలేకపోతున్నానని, తనను క్షమించమని లేఖ రాశాను. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని మోహన్ బాబు వెల్లడించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక హోమం నిర్వహించారు.
మోహన్ బాబు తీరుపై నెటిజన్ల ఆగ్రహం
అయోధ్య ఆహ్వానం ఉన్నా మోహన్ బాబు వెళ్లకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న ఈ చారిత్రక వేడుకకు వెళ్లలేకపోయేంత పని ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు లేని భద్రతా ఇబ్బందులు మోహన్ బాబుకు ఏమున్నాయో? అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. అద్భుత వేడుకకు ఆహ్వానం లేదని ఎంతో మంది బాధపడుతుంటే, ఉన్నా ఉపయోగించుకోలేకపోయారని కలెక్షన్ కింగ్ పై కన్నెర్ర చేస్తున్నారు.
‘కన్నప్ప’ మూవీ పనుల్లో మోహన్ బాబు బిజీ
ఇక ప్రస్తుతం మోహన్ బాబు ‘కన్నప్ప’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార సహా పలువురు ప్రముఖులు ఇందులో నటిస్తున్నారట. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Also: ఈ ఏడాది సమ్మర్‌లో పెద్ద సినిమాల సందడి లేనట్టేనా? ఆ సినిమాలకు లైన్ క్లియర్