Megastar Chiranjeevi: వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!
దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా పండగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయక పద్దతిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ వేడుకకు రాజకీయ, సామాజిక ప్రముఖులను ఆహ్వానించి.. తెలంగాణ సాంప్రదాయక వంటకాలతో విందు ఇస్తారు. ఈసారి ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.
దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి చాలా కాలంగా రావాలనుకుంటున్నానని.. కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ కి ఆహ్వానం వచ్చింది కానీ తనకు దత్తాత్రేయ గారు ఆహ్వానం పంపలేదని అన్నారు. ఆయన దృష్టి పడిన తరువాతే వద్దామని అనుకున్నానని చెప్పారు. తన కెరీర్ లో సూపర్ హిట్(గాడ్ ఫాదర్) కొట్టిన రోజే ఈ కార్యక్రమానికి ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోలు, అభిమానుల మధ్య విద్వేషాలు రగులుతుండేవని.. ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరోని టార్గెట్ చేస్తూ తిట్టడం, పోస్టర్స్ చింపడం వంటి పనులు చేసేవారని.. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నానని చిరు అన్నారు. అందుకే ఇండస్ట్రీలో పార్టీ కల్చర్ తీసుకొచ్చానని.. తన సినిమాలు హిట్ అయినప్పుడు ఇండస్ట్రీకి చెందిన హీరోలను, తమిళ హీరోలను పిలిచి పార్టీ ఇచ్చేవాడినని అన్నారు. ఆ సమయంలో అందరం కలిసి మాట్లాడుకునేవాళ్లమని.. అలా హీరోల మధ్య ఈగోలు లేకుండా ప్రయత్నించేవాడినని చిరు తెలిపారు.
చిరు ఎమోషనల్ కామెంట్స్:
తను రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఎన్నో విమర్శలు చేశారని.. వేలెత్తి చూపించారని అన్నారు. రక్తం అమ్ముకొని బతుకుతున్నాడని ఆరోపణలు చేశారని.. కానీ ఏరోజు కూడా వాటికి స్పందించలేదని అన్నారు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయని.. మాటకి లొంగని వాడు హృదయ స్పందనకి లొంగిపోతారని అన్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమ సారాన్ని ఆచరించమని చిరు కోరారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. దసరా కానుకగా ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ వస్తోంది. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా ఇది తెరకెక్కింది. ఇందులో నయనతార, సత్యదేవ్ లు కీలకపాత్రలు పోషించారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.
'వాల్తేర్ వీరయ్య' అప్డేట్:
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో మొదలుపెట్టారు. ఇప్పటికే వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు విలేజ్ సీక్వెన్స్ ను రాజమండ్రిలో చిత్రీకరిస్తున్నారు.
Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?
Also Read : RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది