Chiranjeevi : దర్శకులకు చిరంజీవి ఇచ్చే కంఫర్ట్ ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు డైరెక్షన్ చేస్తారంటే?
సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి అనుభవం 150 ప్లస్ సినిమాలు. ఎంతో మంది దర్శకులతో ఆయన పని చేశారు. మరి, ఆయనకు డైరెక్షన్ చేసే ఉద్దేశం ఉందా? దర్శకులకు ఆయన ఎటువంటి కంఫర్ట్ ఇస్తారు? ఆయన ఏం చెప్పారంటే?
తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ది 150 ప్లస్ మూవీస్ జర్నీ. ఆ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు, కథానాయకుడు ఆయన. ఎంతో మంది దిగ్గజ దర్శకులతో చిరంజీవి పని చేశారు. 24 శాఖల్లో ప్రతి శాఖ గురించి ఆయనకు అవగాహన ఉంది. తెలుసు కూడా! మరి, ఆయన ఎప్పుడు మెగా ఫోన్ పడతారు? మెగాస్టార్ ఎప్పుడు డైరెక్షన్ చేస్తారు? ఆయన మనసులో సినిమాకు దర్శకత్వం వహించాలనే ఆలోచన ఉందా? దీనికి ఆయన ఏం చెప్పారో తెలుసా?
చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతోంది. మాస్ మహారాజా రవితేజ మరో ప్రత్యేక కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మెగాస్టార్ ముచ్చటించారు. అప్పుడు డైరెక్షన్ టాపిక్ వచ్చింది.
ఆ నమ్మకం వస్తే...
'మీకు దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా?' అని చిరంజీవిని ప్రశ్నించగా... ''ఈ జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలని ఉంది. ఏదో ఒక సమయంలో ఆ సందర్భం వచ్చి... దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే గనుక... నేను డైరెక్షన్ చేస్తాను'' అని సమాధానం ఇచ్చారు. సో... దర్శకుడిగా చిరంజీవిని చూసే అవకాశాలను మనం కొట్టి పారేయలేం.
మానిటర్ చూడను!
Chiranjeevi Interview : ఇప్పుడు చిరంజీవితో సినిమాలు చేస్తున్న ఎక్కువ మంది దర్శకులకు ఆయనకు ఉన్న అనుభవంలో సగం కూడా లేదు. ఆయన సినిమాలు చూసి అభిమానులు అయ్యి, సినిమా పరిశ్రమకు వచ్చి ఆయనతో సినిమాలు చేస్తున్నారు. ఒక విధంగా ఆయన ముందు వాళ్ళు కొత్తవాళ్ళు. వారికి మెగాస్టార్ నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది? ఈ ప్రశ్న చిరంజీవి ముందు ఉంచితే... ''షూటింగులో నేను ఎప్పుడు మానిటర్ చూడను. షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు 'ఓకే' అన్నంత వరకూ అక్కడి నుంచి కదలను. దర్శకుడు ఆ మాట చెప్పే వరకు ఎదురు చూస్తాను. కొత్త యాక్టర్, హీరోని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను'' అని చెప్పారు.
వింటేజ్ చిరును గుర్తు చేసేలా...
'వాల్తేరు వీరయ్య' కథ విన్నప్పుడు అందులో ఎమోషన్ తనను ఆకట్టుకుందని చిరు చెప్పారు. పాటలు, ఫైట్లు ఏ సినిమాకు అయినా అదనపు హంగులేనని... ఎమోషన్ కనెక్ట్ అయితేనే ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆయన చెప్పారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో గొప్ప ఎమోషన్ ఉందన్నారు.
Also Read : హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్లతో - గోల్డెన్ గ్లోబ్‌కు వెళ్ళిన రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు
'వాల్తేరు వీరయ్య' చూసేటప్పుడు 'ముఠా మేస్త్రీ', 'ఘరానా మొగుడు', 'రౌడీ అల్లుడు' సినిమాల్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో? అంత ఉంటుందని, ఆయా చిత్రాలు రీ కలక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చిందని చిరంజీవి చెప్పారు. అభిమానిగా తన సహచర మెగా అభిమానులకు ఏం కావాలో దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ సినిమా చేశారని పేర్కొన్నారు. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా సన్నివేశాలు డిజైన్ చేశారన్నారు. రవితేజలో అప్పటికి, ఇప్పటికీ పెద్ద మార్పులు లేవని చెప్పారు. కుటుంబంతో కలిసి చూసేలా, పిల్లలు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందన్నారు.
Also Read : 'తెగింపు' రివ్యూ : అజిత్ విలనా? హీరోనా? - తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా?