Shaakuntalam song: ఆహా నీలవేణి పూసే పూల ఆమనీ - ‘శాకుంతలం’లోని ఈ సాంగ్ విన్నారా?
సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజైంది. మణిశర్మ స్వరాలు.. సంగీత ప్రియులను తప్పకుండా ఆకట్టుకుంటాయి.
సమంత ప్రధాన పాత్రలో రిలీజ్‌కు ముస్తాబవుతున్న చిత్రం ‘శాకుంతలం’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. యూట్యూబ్‌లో కూడా ట్రెండవ్వుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ‘‘మల్లికా మల్లికా’’ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో సమంతను చూస్తే.. దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా కనిపిస్తోంది. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన స్వరాలు మనకు మరో లోకాన్ని పరిచయం చేస్తాయి. ఈ పాటను గాయని రమ్య బెహరా ఆలపించారు. చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. గోపీచంద్ 'జిల్'తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రతినాయకుడిగా పరిచయమైన కబీర్ సింగ్ ఈ సినిమాలో విలన్ రోల్ చేశారు. కింగ్ అసుర క్యారెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. 'శాకుంతలం' సినిమాలో అందమైన ప్రేమకథ మాత్రమే కాదు... దుష్యంతుడికి, అసురకు మధ్య భారీ యుద్ధ సన్నివేశం ఉంది. పది రోజుల పాటు ఆ వార్ సీక్వెన్స్ తీశారు. సినిమాలో ఆ ఫైట్ కూడా హైలైట్ అవుతుందని సమాచారం.
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం. చిత్రీకరణ ఎప్పుడో పూర్తి అయ్యింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్న సినిమా కావడంతో సీజీ వర్క్ కోసం సమయం తీసుకున్నారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తి అయ్యాయని, చివరకు వచ్చాయని తెలిసింది.
మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఆ రోజు ధనుష్ 'సార్', విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ', కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలు కూడా ఉన్నాయి. అయితే... అందరి చూపు సమంత సినిమాపై ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'యశోద'తో భారీ వసూళ్ళు సాధించిన శామ్, ఈ సినిమాతో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో చూడాలి.
ట్రైలర్ ఎలా ఉందంటే..: ఈ భూమి మీద అమ్మ నాన్నలు అక్కర్లేని తొలి బిడ్డ, మేనక, విశ్వమిత్రుల ప్రేమకు గుర్తు ఈ బిడ్డ. అప్సర బిడ్డైనా అనాథలా మిగిలిందే అంటూ శాకుంతల పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాత దుష్యండితో ప్రేమ.. అనంతరం రాజప్రాసదంలో గర్భవతిగా ఉన్న శాకుంతలకు అవమానం.. ఆ తర్వాతి పరిణమాలు, యుద్ధాలు.. తదితర ఆసక్తికర సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. ఇందులో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు ఒదిగిపోయారు. ఈ విజువల్స్ కొన్ని యుగాలు వెనక్కి తీసుకెళ్తుంది. మరోసారి ‘బాహుబలి’ మూవీని గుర్తుచేస్తుంది. విజువల్స్ క్వాలిటీ విషయంలో ‘బాహుబలి’తో పోల్చలేం. కానీ, సినిమాకు తగినట్లుగానే వీఎఫ్ఎక్స్‌ను మలిచారు. చెప్పాలంటే.. ఇది మరో విజువల్ వండర్‌గా నిలిచిపోనుంది. అలాగే యుద్ధ సన్నివేశాలు కూడా ఆకట్టుకొనేలాగే ఉన్నాయి. ట్రైలర్ చివర్లో ‘‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చివర్లో సింహంపై కూర్చున్న చిన్నారి మరెవ్వరో కాదు.. అల్లు అర్జున్ కుమార్తె అర్హ. మొత్తానికి ‘శాంకుతలం’ ట్రైలర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలాగే ఉంది. అయితే, మూవీ ఆకట్టుకుటుందా లేదా అనేది రిలీజ్ తర్వాతే చెప్పగలం.