MAA Elections: ‘మా’లో మరో డ్రామా.. ఆ గదికి తాళం వేసిన పోలీసులు.. టెన్షన్ టెన్షన్
‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున మంచు విష్ణు ప్యానల్ సభ్యులు దౌర్జన్యం చేశారా? ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులపై దాడి చేశారా? ఆ సీసీటీవీ వీడియోల్లో ఏముంది?
‘మా’ ఎన్నికల్లో నటులు మోహన్ బాబు, వీకే నరేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పోలింగ్ రోజునే వీరే చక్రం తిప్పారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను బెదిరించి మరీ పోలింగ్ నిర్వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం.. మెగా ఫ్యామిలీపై మోహన్ బాబు, నరేష్ పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో వాడీవేడీ వాతావరణం నెలకొంది.
పోలింగ్ సమయంలో మోహన్ బాబు, నరేష్ వర్గం తమపై దాడి చేశారని, దానికి సాక్ష్యంగా సీసీటీవీ కెమెరా వీడియోలు కూడా ఉన్నాయని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ప్రకాష్ రాజ్ లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో ‘మా’ కార్యాలయం వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ‘మా’ కార్యాలయంలోని సర్వర్ రూమ్‌కు తాళాలు వేశారు. మరి, ఆ వీడియోలను బయటకు వెళ్లనిస్తారా? పోలీసులు ఈ వ్యవహారంలో కలుగుజేసుకుని దాడి చేసిన వర్గంపై చర్యలు తీసుకుంటారా? అనేది చూడాలి. అయితే, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు దాడిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, ఆ వీడియోలను మీడియా ముందు పెట్టి.. ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలోనే ఆయన, గెలుపొందిన ఆయన ప్యానెల్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది గెలుపొందారు. అయితే వారంతా ముందే రాజీనామా చేశారు. తమను వ్యక్తిగతంగా బాధపెట్టారని చెబుతూ, తాము విష్ణు ప్యానెల్ తో కలిసి పనిచేయలేమని తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాదు విష్ణు కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ప్రకాష్ రాజ్‌తో సహా అతని ప్యానెల్ సభ్యులెవరూ హాజరు కాలేదు. మెగా కుటుంబాన్ని మంచు ఫ్యామిలీ దెబ్బకొట్టిందనే వార్తలు ట్రెండవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రమాణస్వీకారోత్సవానికి విష్ణు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరినీ ఆహ్వానించలేదని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు వంటి వారిని మంచు విష్ణు స్వయంగా తానే వెళ్లి ఆహ్వానించారు. కానీ మెగా హీరోలను పిలిచినట్టు ఎక్కడా సమాచారం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసిన మంచు మనోజ్ ఆయన్ను ఆహ్వానించారని అన్నారు, కానీ దానిపై కూడా స్పష్టత లేదు. మెగా ఫ్యామిలీని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్టు అర్థమవుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మెగా కుటుంబం మద్దతు పలకడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి