MAA Elections 2021: మర్యాద తప్పుతున్న ‘మా’ అభ్యర్థులు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ నరేష్, కళ్యాణిపై హేమ ఫిర్యాదు
‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, కళ్యాణిపై హేమా మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి ఆమె ఫిర్యాదు చేశారు.
‘మా’ ఎన్నికలు మూడు వివాదాలు.. ఆరు గొడవలుగా సాగుతున్నాయి. తాజాగా నటి హేమా.. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, నటి కరాటే కళ్యాణిపై మండిపడ్డారు. అసత్య ఆరోపణలతో తన ప్రతిష్ట దిగజార్చుతున్నారంటూ మీడియా ముందు వాపోయారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి.. పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను ప్రకాష్ రాజ్ ప్యానల్ ఉండటం వల్ల తనపై లేనిపోని ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని హేమ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఏవో ఆధారాలున్నాయంటూ తనని భయపెడుతున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని హేమా తెలిపారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని హేమా తెలిపారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాలని ఎన్నికల అధికారిని కోరింది. మా ప్రతిష్ట దిగజార్చేలా నరేష్, కళ్యాణి ప్రవర్తిస్తున్నారని, ఓటు హక్కు లేకుండా వారిపై చర్య తీసుకోవాలని ఆమె కోరారు.
ఇన్నాళ్లు ‘మా’లో మా గొడవలు సాధారణమే అనుకున్న తారలంతా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నాగబాబు కూడా రంగంలోకి దిగారు. నరేష్, మంచు విష్ణుపై చలోక్తులు విసిరారు. ‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అభ్యర్థి కోసం ఎవరికైనా మాట ఇచ్చావా అని అన్నయ్య అడిగారు. దీంతో ఆయన ప్రకాష్ రాజ్ పేరు చెప్పారు. దీంతో నేను మంచి చాయిస్ అని చెప్పాను. ప్రకాశ్‌రాజ్ ఆలోచనలకు ఎలక్షన్‌లు చిన్న విషయం. నేనే వచ్చి సేవ చేస్తానని ప్రకాశ్ రాజ్ అన్నారు. ‘మా’ కోసం కొన్ని సినిమాలు వదులుకుని వస్తానని తెలిపారు. ప్రకాశ్ రాజ్ భారతీయ నటుడు. సమస్య వస్తే మోదీ, అమిత్‌షాతో మాట్లాడే దమ్మున్న వ్యక్తి. విష్ణు ప్యానెల్‌లో ఎవరికైనా అంత దమ్ముందా? ముళ్ల కిరిటం పెట్టుకునేందుకు సిద్ధమైన వ్యక్తి ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ ఈసారే కాదు మరో రెండుసార్లు ప్రెసిడెంట్‌గా ఉండాలి. ప్రకాశ్ రాజ్ వల్ల మా ప్రతిష్ట మరింత వృద్ది చెందుతుంది. మా బిల్డింగ్ ఎందుకు అమ్మారో నరేష్‌ను అడగాలి. ఓటుకు పదివేలు ఇస్తున్నారని తెలుస్తోంది. అలా ఇస్తే మా ప్రతిష్ట మసకబారుతుంది’’ అని నాగబాబు అన్నారు.
ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు: ఆయన గొప్ప నటుడు.. ఐదు సార్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన చాలా టాలెంటెడ్, చాలా బిజీ. ఇక్కడ పోటీ చేస్తానంటే.. ‘మా’కు సమయం కేటాయించగలవా అని ప్రశ్నించాను. ఇందుకు అతడు అవసరమైతే సినిమాలు వదులుకొనైనా ‘మా’ కోసం పని చేస్తాను. సినిమాకు రూ.కోటి సంపాదించే సత్తా ఉన్నా అతడు.. ఆ మొత్తాన్ని కూడా వదులుకోడానికి సిద్ధమయ్యారు. ప్రకాష్ రాజ్ ఒక ప్రాంతానికే పరిమితమైనవాడు కాదు.. అతడు భారతీయ నటుడు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో నటించారు. ఇప్పటివరకు ఏ నటుడు అన్ని భాషల్లో నటించలేదు. ప్రకాష్ రాజ్ తెలుగోడు కాదు.. కానీ, తెలుగు సినిమాలకు అవసరమా? కాస్త ఎదగండి.. వయస్సు వచ్చే కొద్ది బాధ్యతాయుతంగా ఉండాలి. వయస్సు పెరిగేకొద్ది తగ్గిపోకూడదు’’ అంటూ విష్ణు ప్యానెల్‌కు నాగబాబు చురకలు అంటించారు.
బాబు మోహన్, కోట.. ప్రకాష్ రాజ్ ఎవరు అని అడిగారు: కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌లు ప్రకాష్ ఎవరు అని అడిగేవారు. అంత ఈర్ష్యా ఎందుకు? ‘మా’ బాధ్యత ముళ్ల కిరీటం అని తెలుసు కూడా ప్రకాష్ రాజ్ వచ్చారు. కొంతమంది ఆ బాధ్యతను ఎంజాయ్ చేస్తారు. కానీ, బాధ్యతగా ఉండరు. నువ్వు పవన్ కళ్యాణ్ వైపా లేదా ఇండస్ట్రీ వైపా అని విష్ణు అడగడం ఆశ్చర్యమేసింది. నేను ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇచ్చేందుకు కూడా నా మీద ఆరోపణలు చేశారు.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి