Karan Johar on Tollywood: రూ.5 కోట్లు రాబట్టే బాలీవుడ్ హీరోలు రూ.20 కోట్లు తీసుకుంటారు - టాలీవుడ్‌పై కరణ్ ప్రశంసలు
నిర్మాత కరణ్ జోహార్ టాలీవుడ్‌పై ప్రశంసలు గుప్పిస్తూనే కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రూ.5 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేరు కానీ రెమ్యునరేషన్లు మాత్రం రూ.20 కోట్ల వరకు తీసుకుంటుంటారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్. అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అయిన కరణ్ ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ఎందరో స్టార్ కిడ్స్‌ను లాంచ్ చేసి వారికి కెరీర్ అందించారు. అయితే ఇప్పుడు హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు వారి సినిమాలకు వచ్చే కలెక్షన్స్‌కు పొంతనే ఉండటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ యూనియన్ పాడ్‌కాస్ట్‌లో కరణ్ ఈ విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ధర్మ ప్రొడక్షన్స్‌ను కేవలం ఇద్దరు వ్యక్తులతో కలిసి స్థాపించాను. అప్పట్లో నా ప్రొడక్షన్ హౌస్ ఒక అంకుర సంస్థలా ఉండేది. ఆ సమయంలో యశ్ చోప్రా నాకు ఒక మాట చెప్పారు. సినిమా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. దానికి పెట్టే బడ్జెట్ ఫెయిల్ అవుతుందన్నారు. ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్‌లతో కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తీశాను. వారి ముగ్గురికీ అది మొదటి సినిమా కాబట్టి బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా హిట్ అయింది కానీ, నేను నష్టపోయాననే చెప్పాలి. ఆ బాధ నుంచి తేరుకోవడానికి నేను రోజూ రాత్రిళ్లు ట్యాబ్లెట్లు వేసుకుని పడుకునేవాడిని. నాకు ఎమోషన్స్ ఎక్కువ. హిందీ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కానీ బిజినెస్ కోణంలో ఆలోచిస్తే.. టాలీవుడ్ చాలా బెటర్. పెట్టిన బడ్జెట్‌కు మంచి వసూళ్లు వస్తాయి. దురదృష్టం ఏంటంటే.. హిందీ చిత్ర పరిశ్రమలో సినిమా కంటే ఎక్కువ శాతం లాభపడేది అందులోని నటీనటులే. ఈ విషయం చెప్తే నన్ను చంపేస్తారు. కానీ రూ.5 కోట్లు వసూళ్లు రాబట్టగలిగే హీరోలు రూ.20 కోట్లు నుంచి రూ.35 కోట్లు తీసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయం? బాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న ఈ రోగానికి మాత్రం వ్యాక్సిన్ లేదు. ఈ ఇండస్ట్రీలో బ్ల్యాక్ మనీ అంటూ ఏమీ లేదు. మాకు బయటి నుంచి ఎలాంటి ఫండ్స్ రావు. అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసారు కరణ్.
ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు ఆయకు మద్దతు పలుకుతున్నారు. ఆ ఆవేదనలోనూ అర్థం ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్‌కి చెందిన కొందరు నటుల గురించి కరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. 2018లోనూ కరణ్ ఇలాగే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడి వైరల్ అయ్యారు. కొందరు హీరోలు తాము తీసుకునే పారితోషికంతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చన్న భ్రమలోనే ఉంటున్నారని అన్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఒక కొత్త ట్యాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలంటే వారి కోసం పర్సనల్ నెట్‌వర్కింగ్ ఏజెన్సీలకు చాలా డబ్బు చెల్లించాల్సి వస్తోందని, సినిమా మార్కెటింగ్ విషయానికొస్తే బాలీవుడ్ నీచంగా ఉందని అన్నారు. ప్రస్తుతం కరణ్ ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్ జంటగా నటిస్తున్నారు.
Read Also: అప్పుడు ఫైటింగ్, ఇప్పుడు మీటింగ్, చిరంజీవి గురించి అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్