Kalki 2898 AD: బాలీవుడ్ విమర్శకుడికి బడా షాక్, రూ.25 కోట్లు దావా వేసిన ‘ కల్కి 2898 AD’ మేకర్స్
‘కల్కి 2898 AD’ సినిమా వసూళ్ల గురించి ఫేక్ ప్రచారం చేసిన సినీ క్రిటిక్స్ మేకర్స్ షాకిచ్చారు. రూ. 25 కోట్ల పరువు నష్టం దావా వేయడంతో పాటు లీగల్ నోటీసులు పంపించారు.
Kalki 2898 AD Team Sues Film Analysts: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. రూ. 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ సినిమా.. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. తన అద్భుత ఆలోచనతో వెండితెరపై మూడు లోకాలను సృష్టించి, ప్రేక్షకులను మైమరిపించారు నాగ్ అశ్విన్. స్టార్ యాక్టర్లు, అదిరిపోయే కథతో నాగ్ అశ్విన్ చేసిన మాయాజాలనికి ఆడియెన్స్ ఆహా అంటున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లిన నాగ్ అశ్విన్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అద్భుతం అంటూ అభినందిస్తున్నారు.
‘కల్కి 2898 AD’పై బాలీవుడ్ క్రిటిక్స్ విష ప్రచారం
ఈ నేపథ్యంలోనే కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ కడుపు మంటతో రగిలిపోతున్నారు. ప్రభాస్ సినిమా అంటేనే అసూయపడే కొందరు సినీ విమర్శకులు.. తాజాగా ‘ కల్కి 2898 AD’ విషయంలోనూ తమ పైత్యాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా సాధించిన కలెక్షన్ల గురించి అడ్డగోలు కామెంట్స్ చేసి పీకల్లోతు చిక్కుల్లో పడ్డారు. ‘ కల్కి 2898 AD’ మేకర్స్ తమ చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిందని అధికారికంగా ప్రకటించారు. కానీ, కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ అవన్నీ ఫేక్ వసూళ్లు అంటూ సోషల్ మీడియాలో పిచ్చిపోస్టులు పెట్టారు.
బాలీవుడ్ క్రిటిక్స్ పై పరువు నష్టం దావా
సుమిత్ కడేల్, రోహిత్ జైశ్వాల్ అనే ఇద్దరు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు ‘ కల్కి 2898 AD’ వసూళ్ల గురించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై పరువు నష్టం దావా వేసింది. తమ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అబద్దం అని ఎవరు చెప్తే పోస్టులు పెట్టారు? అవి వాస్తవమైన వసూళ్లు కాదని చెప్పేందుకు మీ దగ్గరున్న ఆధారాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ తమ వసూళ్లు ఫేక్ అని నిరూపించకపోతే, రూ. 25 కోట్లు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపించింది. ఈ ఇద్దరు ఫిల్మ్ క్రిటిక్స్ పెట్టే పోస్టులు నిర్మాతలను మోసగాళ్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇప్పటికే సుమిత్ ‘ కల్కి 2898 AD’ మేకర్స్ పంపిన నోటీసులు అందుకోగా, రోహిత్ కూడా త్వరలోనే రిసీవ్ చేసుకోన్నట్లు తెలుస్తోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 AD’ మూవీలో ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్ దాటింది. ఇక ‘ కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.