Nayanthara: అట్లీపై నయనతార అసంతృప్తి, అసలు కారణం దీపికేనా?
‘జవాన్’ చిత్రంలో తనకు పాత్రకు సరైన గుర్తింపు రాకపోవడం పట్ల నయనతార అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. తన క్యారెక్టర్ తో పోల్చితే దీపికా పదుకొణె క్యామియో రోల్ అద్భుతంగా ఉండటం ఆమెకు ఆగ్రహం కలిగించిందట.
సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార తాజాగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు సాధిస్తోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ‘జవాన్’ దర్శకుడు అట్లీపై నయనతార తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తన పాత్రను ట్రీట్ చేసిన విధానం ఆమెకు అస్సలు నచ్చలేదట.
అట్లీపై నయనతార అసంతృప్తి
‘జవాన్’ చిత్రంలో నయనతార హీరోయిన్ పాత్ర పోషించగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె క్యామియో రోల్ పోషించింది. అయితే, నయనతార పాత్రతో పోల్చితే, దీపికా క్యారెక్టర్ అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. నయనతార కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, తన పాత్రను ఈ సినిమాలో తక్కువ చేసి చూపించడం పట్ల ఆమె కోపంగా ఉందట. ఈ సినిమా నయనతార, షారుఖ్ మూవీలా కాకుండా, దీపికా, షారుఖ్ ఖాన్ మూవీల ఉందంటూ సన్నిహితుల దగ్గర ఆమె అన్నట్లు తెలుస్తోంది.
‘జవాన్’ ప్రమోషన్ లో పాల్గొనని నయనతార
‘జవాన్’ చిత్రంలో తన క్యారెక్టర్ పట్ల నయనతార తొలి నుంచి అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ముంబైలో జరిగిన సక్సెస్ మీట్ లో చిత్రబృందం అంతా పాల్గొన్నా, నయనతార హాజరు కాలేదు. అసంతృప్తి కారణంగానే ఈ ఈవెంట్ లో పాల్గొనలేదని వస్తున్న వార్తలను సినీ జనాలు ఖండిస్తున్నారు. నయనతార సినిమా ఈవెంట్లు వెళ్లదని, తన సినిమాల ప్రమోషన్స్ లో కూడా పాల్గొనదని చెప్తున్నారు.
ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాలు చేయనట్టే?
ఇక తన తొలి బాలీవుడ్ సినిమాలోనే తన పాత్రను సరిగా ఎలివేట్ చేయకపోవడంతో నయనతార కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ లో సినిమాలు చేయకూడదని భావిస్తోందట. అంతేకాదు, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కొంత మంది ఆమెకు కథలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా, ఆమె వినేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘జవాన్’
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా ఇప్పటి వరకు రూ. 1000 కోట్లు వసూళు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ‘జవాన్’ మూవీలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించింది. ప్రియమణి, సన్యా మల్హోత్రా సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు.
Read Also: కృతి శెట్టికి బర్త్‌డే బహుమతి - శర్వానంద్ 35లో లుక్ చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial