Leo Movie: ‘లియో’ స్టోరీని హాలీవుడ్ మూవీ నుంచి కొట్టేశారా - సాక్ష్యం ఇదిగో!
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘లియో’. ఈ మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ‘లియో’ కథ ఓ హాలీవుడ్ మూవీ నుంచి కొట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘లియో’. చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ యాక్టర్లు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్నది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, పాటలు, బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలు ఉన్న సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇంత చప్పగా ఉంటుందని ఊహించలేని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టాక్ ఎలా ఉన్నా ‘లియో’ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. వ్యూస్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
హాలీవుడ్ మూవీ నుంచి ‘లియో’ కథ కాపీ?
విడుదలకు రెడీ అవుతున్న ‘లియో’ చిత్రం తాజాగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సినిమా కథను ఓ హాలీవుడ్ మూవీ నుంచి కొట్టేశారంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. లియో సినిమాలోని సీన్లను సదరు హాలీవుడ్ మూవీ సీన్లతో పోల్చి చూపిస్తున్నారు. వాస్తవానికి చాలా మంది దర్శకుడు హాలీవుడ్ సినిమాలను చూసి ప్రేరణపొంది సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. పలువురు తెలుగు దర్శకులు కూడా చాలా సినిమాల్లో హాలీవుడ్ సీన్లను ఉన్నది ఉన్నట్లు దించేసిన సందర్భాలున్నాయి. సేమ్ ‘లియో’ విషయంలోనూ ఇలాగే జరిగిందంటున్నారు నెటిజన్లు.
అచ్చం ‘ది హిస్టరీ ఆఫ్ వాయిలెన్స్’ మాదిరిగానే..
2005లో హాలీవుడ్ లో ‘ది హిస్టరీ ఆఫ్ వాయిలెన్స్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నుంచే ‘లియో’ మూవీ స్టోరీని కాపీ కొట్టారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆ సినిమా పోస్టర్ తో పాటు ‘లియో’ పోస్టర్ ను పక్కనపెట్టి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘ది హిస్టరీ ఆఫ్ వాయిలెన్స్’ మూవీ అప్పట్లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఓ సాధారణ వ్యక్తి అనుకోకుండా ఇద్దరు దొంగలను హత్య చేస్తాడు. చాలా మంది అతడిని గ్యాంగ్ స్టర్ అనుకుంటారు. ఆయనను చంపేందుకు కొంత మంది మాఫియా ముఠా సభ్యులు వెంటపడతారు. వారి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుక వేరే ప్రాంతానికి వెళ్తాడు. మాఫియా ముఠా అక్కడికి కూడా వెళ్తుంది. ఎక్కడికి వెళ్లినా ప్రాణాలు కాపాడుకోవడం కష్టం అని హీరో భావిస్తాడు. తిరగబడాల్సిందేనని నిర్ణయించుకుంటాడు. తనను చంపాలని చూసే వారిని చంపే ప్రయత్నం చేస్తాడు. తను కూడా గ్యాంగ్ స్టర్ గా మారిపోతాడు.
లియో టీజర్, ట్రైలర్ చూస్తే, అచ్చం ఇదే కథతో తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు కాపీ క్యాట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, ఒరిజినల్ హాలీవుడ్ మూవీతో పోల్చితే ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దాడు అనేది విడుదల తర్వాతే తెలియనుంది. అయితే, విజయ్ వ్యతిరేక ఫ్యాన్స్ మాత్రం ‘లియో’ ప్రీమేక్ అంటూ కామెడీ చేస్తున్నారు.
Hollywood film & Joseph Vijay's #LeoFilm sharing same synopsis in few booking site
— Manobala Vijayabalan (@ManobalaV) September 25, 2023
A History of Violence:
"A mild-mannered man becomes a local hero through an act of violence, which sets off repercussions that will shake his family to its very core."#Leo:
"A mild-mannered… pic.twitter.com/ob4TJNG1QE
Read Also: 'లియో'పై టాలీవుడ్ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు, నిప్పులు చెరుగుతున్న విజయ్ ఫ్యాన్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial