Venkatesh: చిరు లేకపోతే హిమాలయాల బాట పట్టేవాడిని, విక్టరీ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Venkatesh: వెంకీ 75 సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో నటుడు వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లేకుంటే సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోయేవాడినని వెల్లడించారు.
Venkatesh About Chiranjeevi: టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంటకేష్ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ‘వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్’ పేరుతో వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, హీరోలు నాని, శ్రీవిష్ణు, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, హీరోయిన్లు ఆండ్రియా, రుహానీ శర్మ, డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు సినీ తారలు పాల్గొన్నారు. ఈ వేడుకలో పాత పాటకు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి.
సినిమాలను వదిలేసి హిమాలయాలకు వెళ్దాం అనుకున్నా- వెంకటేష్
ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లేకపోతే సినిమాలను వదిలేసి హిమాలయాలకు వెళ్లే వాడినని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. "చాలాసార్లు సినిమాలను వదిలి పెట్టాలి అనుకున్నాను. అంతలోనే చిరంజీవి మంచి బ్లాక్ బస్టర్ అందుకునే వారు. బాలకృష్ణ, నాగార్జున వీళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. 9 ఏండ్ల తర్వాత చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150‘తో అద్భుత విజయాన్ని అందుకున్నారు. నేనూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి అనుకున్నాను. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలు కొనసాగించాను. కృషి, పట్టుదల, నిలకడతోనే సక్సెక్ లభిస్తుంది. ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా నేచురల్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. చిరంజీవితో కలిసి త్వరలోనే మూవీ చేస్తా” అని చెప్పుకొచ్చారు.
దిగ్గజ దర్శకులతో కలిసి పని చేసే అవకాశం దక్కింది- వెంకటేష్
ఇక తన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు వెంకటేష్. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో తన సినీ కెరీర్ మొదలైందన్నారు. దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్ సహా పలువురు స్టార్ డైరెక్టర్లతో కలిసి పని చేసే అవకాశం రావడం అద్భుతం అన్నారు. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేయగలిగానన్నారు. ఫ్యాన్స్ తనను ఎన్నో పేర్లతో పిలిచే వారిని చెప్పారు. మొదట్లో విక్టరీ వెంకటేష్ అనేవారని, ఆ తర్వాత రాజా అని పిలిచే వారన్నారు. కొద్ది రోజులు పెళ్లికాని ప్రసాద్, ఆ తర్వాత పెద్దోడు, ఇప్పుడు వెంకీ మామా అని పిలుస్తున్నారని చెప్పారు. ఎలా పిలిచినా తన మీద ప్రేమ మాత్రం తగ్గలేదన్నారు.
సంక్రాంతి కానుకగా ‘సైంధవ్’ విడుదల
వెంకీ కెరీర్ లో 75వ సినిమాగా ‘సైంధవ్’ తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2024 నాడు విడుదలకానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రానికి శైలేష్ కొలనుదర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతోంది. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘సైంధవ్’ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.