Happy Birthday SRK: హిట్ లేక ఇబ్బంది పడుతున్న షారుఖ్, 2023లోనైనా ఫామ్‌లోకి వచ్చేనా?
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చాలా కాలంగా సాలిడ్ హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. 2013లో వచ్చిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ మినహా ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
షారుఖ్ ఖాన్... భారతీయ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని హీరో. ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి బాలీవుడ్ బాద్ షాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో అగ్రహీరోగా ఎదిగాడు. తొలుత టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన షారుఖ్.. ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టాడు. ‘దీవానా’ సినిమాతో బాలీవుడ్‌లో దర్శనం ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. ‘బాజీగర్’ మూవీతో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా పలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడు. ఇక 1995లో వచ్చిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమా షారుఖ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. షారుఖ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను చూసి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు షారుఖ్‌కు అభిమానులు మారారు. ఆ తర్వాత షారుఖ్ నటించిన పలు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన సందర్భాలున్నాయి.
‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తర్వాత ఆకట్టుకోని షారుఖ్
షారుఖ్ ఖాన్ తన సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు, మరెన్నో రికార్డులు నమోదు చేశాడు. ఒకానొక సమయంలో షారుఖ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానుల హడావిడి మామూలుగా ఉండేది కాదు. షారుఖ్, షారుఖ్ అంటూ పూనకంతో ఊగిపోయేవాళ్లు. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. కానీ, రాను రాను ఆయన క్రేజ్ తగ్గుతూ వస్తోంది. 2013లో విడుదలైన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా పెద్దగా హిట్స్ అందుకోలేదు. 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. గడిచిన 4 సంవత్సరాలుగా వెండి తెరకు దూరంగా ఉన్నాడు. షారుఖ్ ఈ ఏడాదిలో కామియో రోల్స్ చేయడం తప్ప పెద్దగా సాధించింది ఏమీ లేదు.
వరుస సినిమాలతో జోరు మీదున్న షారుఖ్
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వరుస సినిమాలో దూసుకొస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ అనే సినిమా తెరెక్కుతున్నది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్టాత్మక యష్‌రాజ్ ఫిలింస్ సంస్థకు ‘పఠాన్’ 50వ సినిమా కావడం విశేషం. ఇక ‘పఠాన్’ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నది. వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకు రెడీ అవుతున్నది. ఈ సినిమాకుగాను షారుఖ్ రూ. 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు బీటౌన్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. అటు ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే రూ. 15 కోట్లు, మరో కీలక పాత్ర పోషిస్తున్న జాన్ అబ్రహాం రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తున్నది.
అటు తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ కాంబోలో ‘జవాన్’ అనే సినిమా రూపొందుతున్నది. తమిళంలో మంచి హిట్ ట్రాక్ ఉన్న అట్లీ.. సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న షారుఖ్ కు అదిరిపోయే హిట్ ఇవ్వడం ఖాయం అని సినీ జనాలు భావిస్తున్నారు. అట్లీ తెరకెక్కించిన నాలుగు సినిమాలు అదిరిపోయే విజయాన్ని అందుకున్నాయి. వీటిలో మూడు సినిమాలు విజయ్ తోనే తీశాడు. ఈసారి ఏకంగా బాలీవుడ్ మీదే గురిపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైతం ఎండింగ్ కు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ మూవీ 02 జూన్ 2023లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించింది.
షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో ‘డుంకి’ అనే మరో సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో షారుఖ్ సరసన తాప్సీ పొన్ను హీరోయిన్ గా చేస్తున్నది. బొమన్ ఇరానీ కీరోల్ పోషిస్తున్నారు.
బాలీవుడ్ బాద్ షాకు ‘బాయ్ కాట్’ భయం!
మొత్తానికి చాలా విరామం తర్వాత షారుఖ్ 2023లో వరుసగా పఠాన్, జవాన్, డుంకి సినిమాలతో అలరించబోతున్నాడు. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ బాద్ షా ఈ సినిమాలతో దుమ్మురేపాలి అనుకుంటున్నాడు. అటు బాలీవుడ్‌ను కుదిపేస్తున్న బాయ్ కాట్ ఉద్యమ భయం షారుఖ్ కు పట్టుకుంది. ఇప్పటికే ఈ ఆన్ లైన్ ఉద్యమం ద్వారా పలు బాలీవుడ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ తన సత్తా చాటాలి అనుకుంటున్న షారుఖ్ కు ఈ ఉద్యమం ఎక్కడ ఇబ్బంది పెడుతుందోనని షారుఖ్ ఆందోళన పడుతున్నాడు.
Read Also: తిరుపతిలో రిషబ్ శెట్టి సందడి - ‘కాంతార’ సీక్వెల్ ఉన్నట్లా? లేనట్లా?